బంజారాహిల్స్, నవంబర్ 11: ‘కుల గణన అని టీవీల్లో చెబుతున్నారు.. మీరేంటి మేడం మా ఆధార్ కార్డులు అడుగుతున్నారు’.. అంటూ ఓ మహిళ ప్రశ్న. ‘పేదోళ్లకు మేలు చేసేందుకు సర్వే చేస్తున్నామంటూ అపార్ట్మెంట్ల వద్దకు ఎందుకు వస్తున్నారం’టూ మరో వ్యక్తి నిలదీత. ‘రేషన్ కార్డులు కావాలని గతంలోనే దరఖాస్తు చేశాం.. మళ్లీ రేషన్ కార్డు ఉందా అని ప్రశ్నలు ఏంటి’ ఆని మరో మహిళ ఆగ్రహం.. ఖైరతాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న సమగ్ర కుటుంబ సర్వేలో ఎన్యుమరేటర్లకు ఎదురైన ప్రశ్నలివి. మూడురోజుల పాటు ఇండ్లకు స్కిక్కర్లు వేసిన సర్వే సిబ్బంది.. సోమవారం నుంచి ఇండ్లలోని కుటుంబాల వివరాలు సేకరించే పనిని ప్రారంభించారు.
బంజారాహిల్స్చ జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ డివిజన్ల పరిధిలో సర్వేకు వెళ్లిన వారికి స్థానికుల నుంచి సహకారం లభించడం లేదు. కుటుంబసభ్యులకు చెందిన పేర్లతో పాటు కులం, వృత్తి చెప్పేందుకు మాత్రమే కొందరు ఇష్టపడుతుండగా,మరికొంతమంది మాత్రం సర్వే ఎందుకు చేస్తున్నారో చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరికొంతమంది తమను ఫోన్ నంబర్లు, ఆధార్ కార్డు నంబర్లు చెప్పాలని కోరిన సర్వే సిబ్బందిని అనుమానంగా చూస్తున్నారు. సొంతిళ్లు ఉన్నవారు సైతం తమది కిరాయి ఇల్లు అంటూ చెబుతుండగా, మరికొంతమంది తమ పిల్లలు ఉన్నప్పుడు రావాలని చెప్పి ముఖం మీదనే తలుపులు వేసుకుంటున్న దృశ్యాలు కనిపించాయి. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో కుల గణన చేస్తున్నామని ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ప్రకటనలు చేస్తున్న తరుణంలో ఇండ్ల వద్దకు వచ్చి కులంతో పాటు 75 రకాలైన ప్రశ్నలు అడుగుతుండటంతో సిబ్బందితో జనం వాగ్వాదానికి దిగుతున్నారు.