
బస్తీ స్థాయిలోనే నాణ్యమైన వైద్య సేవలందించే సంకల్పంతో బల్దియా, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా శుక్రవారం 32 బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే 226 ప్రాంతాల్లో బస్తీ దవాఖానలు విస్తృత సేవలందిస్తుండగా, కొత్త వాటితో కలిపి దవాఖానల సంఖ్య 258కి చేరింది. పాత బోయిన్‌పల్లిలో వైద్యఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, షేక్‌పేట డివిజన్ రాజీవ్‌గాంధీ కమ్యూనిటీహాల్లో మంత్రి కేటీఆర్, ధూల్‌పేట చంద్రకిరణ్ బస్తీలో మంత్రి తలసాని, పురానాపూల్‌లో మంత్రి మహమూద్‌అలీ, చింతల్ డివిజన్ ఎన్ఎల్బీనగర్లో మంత్రి మల్లారెడ్డి, ఖైరతాబాద్ మహాభారత నగర్లో మేయర్ విజయలక్ష్మి, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి బస్తీ దవాఖానలను ప్రారంభించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు ఇంటింటికి తిరిగి టీకా వేసుకున్నారా.. లేదా అని అడిగి తెలుసుకున్నారు. షేక్‌పేట డివిజన్ రాజీవ్‌గాంధీ కమ్యూనిటీహాల్లో దవాఖాన ప్రారంభోత్సవం తర్వాత వైద్యసేవలపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. ల్యాబ్, చికిత్స గది పరిశీలన తర్వాత మంత్రి బీపీ పరీక్ష చేయించుకున్నారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో హైదరాబాద్‌వ్యాప్తంగా ప్రభుత్వం బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. ప్రతి 5 వేల నుంచి 10 వేల జనాభాకు ఒక బస్తీ దవాఖాన ఏర్పాటు చేసి ఉచితంగా వైద్య సేవలందించాలని నిర్ణయించి గ్రేటర్ వ్యాప్తంగా 350 చోట్ల బస్తీ దవాఖానల ఏర్పాటే లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. ఇందులో ఇప్పటి వరకు 226 చోట్ల అందుబాటులోకి తీసుకు వచ్చి.. ఒక్కో కేంద్రంలో ప్రతిరోజు 100 మందికి ఓపీ సేవలు అందిస్తున్నది. ఇప్పటి వరకు 60 లక్షల 18 వేల మంది బస్తీ దవాఖానలను వినియోగించుకోగా 11 లక్షల 60 వేల మందికి వైద్యాధికారులు 57 రకాల ఉచిత పరీక్షలు చేశారు. మరోవైపు శుక్రవారం గ్రేటర్లో ఒకే రోజు 32 బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకువచ్చారు. వచ్చే వారం రోజుల్లో మరో ఏడు చోట్ల బస్తీ వైద్యశాలలను ఏర్పాటు చేస్తామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ ప్రకటించారు. రెండు మూడు నెలల్లో మరో 35 చోట్ల బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఇదిలా ఉంటే ఓల్డ్ బోయిన్‌పల్లిలో ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, షేక్‌పేట రాజీవ్‌గాంధీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటైన బస్తీ దవాఖానను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. గోషామహల్‌లోని ధూల్‌పేట చంద్రకిరణ్ బస్తీలో మంత్రి తలసాని, పురానాపూల్‌లో మహమూద్ అలీ, చింతల్ డివిజన్ పరిధి ఎన్ఎల్బీనగర్లో మంత్రి మల్లారెడ్డి, ఖైరతాబాద్ మహాభారత నగర్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బస్తీ దవాఖానలను ప్రారంభించారు. మిగిలిన చోట్ల స్థానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకు వచ్చి సేవలకు శ్రీకారం చుట్టారు
మెరుగైనవైద్యసేవల కోసమే..
ప్రజలకు మెరుగైన చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రజల చెంతకు బస్తీ దవాఖానలను తీసుకువస్తున్నాం. బస్తీ దవాఖానల్లో అన్ని రకాల పరీక్షలు చేస్తున్నారు. రోగుల నుంచి సేకరించిన శాంపిల్స్‌ను తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్‌కు చేర్చి, సంబంధిత రిపోర్టుల ఆధారంగా వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. బస్తీ దవాఖానల్లో మధుమేహం, కార్డియాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, అప్తామాలజీ, డెంటల్ తదితర వ్యాధులకు సైతం చికిత్స లభిస్తున్నది.
-మంత్రి మహమూద్ అలీ
ప్రజల వద్దకే ప్రభుత్వ వైద్యం
ప్రజల వద్దకు వైద్య సేవలు తీసుకెళ్లాలనే ఆలోచనతో ప్రభుత్వం బస్తీ దవాఖానలు ఏర్పాటు చేస్తున్నది. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలో ఒకో డివిజన్లో 2 చొప్పున, ఎక్కువ జనాభా కలిగిన డివిజన్లలో మూడు చొప్పున కలిసి మొత్తం 350 బస్తీ దవాఖానలను ప్రారంభించాలని నిర్ణయించి ఇప్పటి వరకు 226 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నాం. నూతనంగా మరో 32 వైద్యశాలలను ప్రారంభించాం. పేద ప్రజలు ఈ బస్తీ వైద్యసేవలను వినియోగించుకోవాలి. కరోనా బారిన పడకుండా ప్రతిఒక్కరూ తప్పక మాస్క్ వేయించుకోవాలి.
త్వరలో నాలుగు సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలు
హైదరాబాద్‌లో నలుదికులా సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలు ఉండాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు వెయ్యి పడకలతో కూడిన మరో నాలుగు సూపర్ స్పెషాలిటీ దవాఖానలకు త్వరలో శంకుస్థాపన చేయనున్నాం. ఎర్రగడ్డ, అల్వాల్, గచ్చిబౌలి, ఎల్బీనగర్లోని గడ్డిఅన్నారంలో ఏర్పాటు చేయబోయే సూపర్ స్పెషాలిటీ వైద్యశాలలకు త్వరలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. బస్తీ దవాఖానాలకు ప్రతినిత్యం వందల మంది వస్తున్నారు. ప్రతి దగ్గర డాక్టర్, స్టాఫ్‌నర్స్, ఏఎన్ఎంలతో పాటు మందులు అందుబాటులో ఉంచుతున్నాం. టీ – డయాగ్నస్టిక్స్లను ఏర్పాటు చేసి 57 రకాల పరీక్షలు చేసి ఉచితంగా రిపోర్టులు అందిస్తున్నాం. జంటనగరాల్లో ఇప్పటి వరకు 60 లక్షల 18 వేల మంది బస్తీ దవాఖానలను వినియోగించుకోగా ఇప్పటి వరకు 11 లక్షల 60 వేల మందికి 57 రకాల పరీక్షలు ఉచితంగా చేశాం.
వైద్య సిబ్బందిని ప్రశంసించిన మంత్రి కేటీఆర్
జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్‌పేట్ డివిజన్ రాజీవ్‌గాంధీ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానను ప్రారంభించిన మంత్రి కేటీఆర్ అక్కడి సిబ్బందితో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. పరీక్షల కోసం ఏర్పాటు చేసిన ల్యాబ్, చికిత్స గదిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ బీపీ పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వైద్య సేవలందిస్తున్న సిబ్బందిని మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. అనంతరం వైద్య సిబ్బంది, దివ్యాంగులతో కలిసి సెల్ఫీలు దిగారు.