సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ) : సాధారణంగా దసరా, సంక్రాంతి వంటి పండుగల సమయంలో ఇండ్లకు తాళాలు వేసి ఊరెళ్లే వారిని లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడే దొంగలు వేసవిలోనూ విజృంభిస్తుంటారు. మే నెల వచ్చిందంటే దాదాపు అన్ని స్థాయిల విద్యార్థులకు సెలవులు ప్రకటిస్తారు. దీంతో చాలా మంది విహార యాత్రలకు వెళ్తుంటారు. మరికొందరు బంధువుల ఇండ్లకు, సొంతూర్లకు పయణమవుతారు. దీనిని ఆసరాగా చేసుకుని దోపిడీ దొంగలు సైతం రెచ్చిపోయే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా కాలనీలు, అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఇండ్లపైనే దోపిడీ దొంగలు దృష్టి పెడుతారు. మధ్యా హ్నం, రాత్రి సమయాల్లో నిర్మానుష్యంగా ఉండటంతో ఈ ప్రాంతాల్లో తాళాలు వేసి ఉన్న ఇండ్లను లక్ష్యంగా చేసుకుని తమ చేతివాటాన్ని చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వీటితోపాటు కొత్తగా ఏర్పడుతున్న కాలనీల్లో దూర దూరంగా ఉండే గృహాలు, ఒంటరిగా ఉండే వృద్ధులు, మహిళలను సైతం లక్ష్యంగా చేసుకుని దొంగలు దోపిడీకి పాల్పడే ప్రమాదం ఉందంటున్నారు పోలీసులు.
విహార యాత్రలు, ఊళ్లకు వెళ్లే ప్రజలు తగిన జా గ్రత్తలు తీసుకుంటే దొంగల బారి నుంచి తమ విలువైన వస్తువులు, డబ్బును రక్షించుకోవచ్చు. బయటకు వెళ్లే ముందు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇలా ముందస్తు సమాచారం ఇవ్వడం వల్ల స్థానిక పోలీసులు ఆయా ఇండ్లపై ప్రత్యేక దృష్టి పెడుతారు. మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో గస్తీ చేపట్టడం వంటివి చేస్తారు. ఇండ్లకు సీసీ కెమెరాలను ఏ ర్పాటు చేసుకోవడంతోపాటు వాటిని తమ మొబైల్ ఫోన్లలో ఆన్లైన్ ద్వారా ఎక్కడి నుంచైనా పర్యవేక్షించవచ్చు. నమ్మకమైన సెక్యూరిటీ గార్డును నియమించుకోవాలి. ముఖ్యంగా బయటకు వెళ్లినా, వెళ్తున్న విషయాలను సోషల్ మీడియాలో పెట్టకపోవడం ఉత్తమమం. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వలన మీరు ఇంట్లో లేరనే విషయం దోపిడీ దొంగలకు సైతం తెలిసిపోయి దొంగతనాలకు పాల్పడే అవకాశాలుంటాయి.