సిటీబ్యూరో, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అధిక వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎలాంటి విపతర పరిస్థితినైనా ఎదురొనేందుకు జీహెచ్ఎంసీ యంత్రాగం సర్వసన్నద్ధంగా ఉందని కమిషనర్ ఆర్ వీ కర్ణన్ తెలిపారు. బుధవారం జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లోని కంట్రోల్ రూంను కమిషనర్ తనిఖీ చేశారు. ఫిర్యాదులు పై ఆరా తీశారు. కంట్రోల్ రూం కార్యకలాపాలను సమీక్షించారు.
24X7 అప్రమత్తంగా ఉండాలని కంట్రోల్ రూం సిబ్బందికి సూచించారు. అనంతరం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో మోడరేట్ వర్షాలు కురుస్తున్నాయని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశామని చెప్పారు.
ఉన్నతాధికారులను హెడ్ క్వార్టర్ లో ఉండాలని ఆదేశించామన్నారు. ఇప్పటికే జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని గమనిస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు శిథిలావస్థకు చేరిన భవనాలలో నివాసం ఉంటున్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నారని వివరించారు.
వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుందని కమిషనర్ చెప్పారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా మ్యాన్ హోల్‌లను తెరవద్దు ప్రజలను కోరారు. మ్యాన్ హోల్ పై ఏమైనా ఫిర్యాదులు ఉంటే జీహెచ్ఎంసీకంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.
‘మూసారాంబాగ్’ పనుల పరిశీలన
మలక్‌పేట/అంబర్‌పేట: నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మూసీ పరీవాహక ప్రాంత ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని బల్దియా కమిషనర్ ఆర్ వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం మూసారాంబాగ్, పాత మలక్‌పేట డివిజన్లలో సర్కిల్-6 డిప్యూటీ కమిషనర్ ఎంకె అలీ, ఈఈ పీర్సింగ్, ఏఎంహెచ్ఓ రుద్ర శ్రీనివాస్, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో కలిసి ఆయన పర్యటించారు. మూసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణ పనులను నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయాలన్నారు.