కొండాపూర్, నవంబర్ 6 : లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్ భాగస్వామైన టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్ లాయిడ్స్ ఆఫ్షోర్ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా లక్ష కిలోల బియ్యాన్ని విరాళంగా అందజేసింది. గురువారం నాలెడ్జ్ సిటీలోని సంస్థ కార్యాలయంలో బియ్యం నింపిన వాహనాలను లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శిరీష వోరుగంటి జెండా ఊపి ప్రారంభించారు. బియ్యాన్ని నగరంలోని పలు స్వచ్ఛంద సంస్థలకు పంపిణీ చేయనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
లక్ష కిలోల బియ్యాన్ని విరాళంగా ఇచ్చి దేశంలోనే ఒక చారిత్రాత్మక రికార్డును సృష్టించినట్లు తెలిపారు. సంస్థ ఉద్యోగులు 50 వేల కిలోల బియ్యాన్ని అందించగా, మిగతా మొత్తాన్ని సంస్థ అందించినట్లు తెలిపారు. బియ్యాన్ని 55 స్వచ్ఛంద సంస్థల ద్వారా అవసరమైన వేలాది మందికి పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అండ్ హెడ్ ఆఫ్ హెచ్ఆర్ పీపుల్ అండ్ ప్లేసెస్తో డాక్టర్ విపుల్ సింగ్, సంస్థ ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.