Medchal | మేడ్చల్/శామీర్పేట, జూలై 28: కుక్కలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక చోట దాడికి తెగబడి.. నష్టం కలిగిస్తున్నాయి. తాజాగా, శామీర్పేట మండలంలో గొర్రెల పాకపై దాడి చేసి, తీవ్ర నష్టం కలిగించాయి. స్థానికుల కథనం ప్రకారం.. జీనోమ్ వ్యాలీ పీఎస్ పరిధిలోని లాల్గడీమలక్పేటకు చెందిన గొర్రెల వ్యాపారి వేటూరి నర్సింహ శనివారం సాయంత్రం రోజు మాదిరిగా 51 గొర్రెలను తన పాకలో కట్టేసి, ఇంటికి వెళ్లిపోయాడు.
రాత్రిపూట అటుగా వచ్చిన కుక్కలు గొర్రెల పాకపై దాడి చేశాయి. కట్టేసి ఉన్న గొర్రెలను దారుణంగా కొరికి చంపేశాయి. 51 గొర్రెల్లో 41 గొర్రెలు మృతి చెందాయి. మరో 10 గొర్రెలు గాయాలపాలయ్యాయి. ఆదివారం ఉదయం గొర్రెల పాకకు వచ్చిన నర్సింహ చనిపోయిన గొర్రెలను చూసి కంగుతున్నాడు. కుక్కల దాడులను అరికట్టాలని పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి, నష్ట పరిహారం అందజేయాలని కోరారు.