ఘట్ కేసర్, ఏప్రిల్ 15: స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ విధానాన్ని విరమించుకోవాలని ఘట్ కేసర్ లో మంగళవారం డాక్యుమెంట్ రైటర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తీసుకువచ్చిన స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ విధానంతో డాక్యుమెంట్ రైటర్లు రోడ్డున పడే దుస్థితి వస్తుందని ఆరోపించారు. ఘట్ కేసర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సమీపంలో ప్ల కార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు దొరకక దస్తావేజు లేఖరు వృత్తిని ఎంచుకొని మరి కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నామని, స్లాట్ బుకింగ్ విధానంతో ప్రతి ఒక్కరూ రోడ్డున పడే పరిస్థితి నెలకొందని ఆరోపించారు. స్లాట్ బుకింగ్ రిజిస్ట్రేషన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విరమించుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.