బన్సీలాల్ పేట్, జూలై 4 : గాంధీ మెడికల్ కాలేజీలోని రీజనల్ ట్రైనింగ్ సెంటర్లో మూడు రోజుల పాటు కొనసాగిన ‘బేసిక్ కోర్స్ ఇన్ మెడికల్ ఎడ్యుకేషన్ (బీసీఎంఈ)’ మూడవ శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది. గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే.ఇందిర, సూపరింటెండెంట్ ప్రొఫెసర్ సీహెచ్ఎన్ రాజకుమారిలు ముఖ్యఅతిథులుగా హజరై పలు అంశాలపై చర్చించారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల మేరకు తెలంగాణలోని 60 మెడికల్ కాలేజీలను మూడు రీజియన్స్గా విభజించారని, గాంధీ మెడికల్ కాలేజీ ఓ రీజనల్ కేంద్రంగా కొనసాగుతుందని, ఈ రీజియన్‌లో 26 మెడికల్ కాలేజీలు ఉన్నాయని తెలిపారు.
వైద్యవిద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు కేవలం మార్కులే ప్రామాణికం కాదని, రోగులు, రోగి సహాయకులు, ఇతర విభాగాలకు చెందిన వైద్యులు, సిబ్బందితో కమ్యూనికేషన్ మెరుగు పర్చుకునేందుకు నూతన బోధన పద్ధతులు ఉపయుక్తంగా ఉంటాయన్నారు. కార్యక్రమంలో గాంధీ రీజనల్ సెంటర్ కన్వీనర్ డాక్టర్ కిరణ్ మాదల, కో కన్వీనర్ డాక్టర్ సుభోద్కుమార్, వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ రవిశేఖరరావు, డాక్టర్ వాల్యా, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ సునీల్‌కుమార్, ఆర్ఎంఓ–1 డాక్టర్ శేషాద్రి, సీనియర్ ఫ్యాకల్టీలు డాక్టర్ తిరుపతిరావు, డాక్టర్ ఐశ్వర్య, డాక్టర్ సృజన తోపాటు 26 మెడికల్ కాలేజీలకు చెందిన ప్రిన్సిపాల్స్, వైద్యులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.