తెలుగు యూనివర్సిటీ, సెప్టెంబర్ 9ః వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి మరణించడాన్ని జీర్ణించుకోలేని ఓ కొడుకు వినియోగదారుల ఫోరం కోర్టును ఆశ్రయించాడు. అక్కడ న్యాయం పొంది, తనలా ఇతరులు మోసపొద్దని సమాజానికి తెలియజేశారు. రెడ్‌హిల్స్‌లో గల ఫ్యాప్సీలో మాసబ్‌ట్యాంకు నివాసి, ప్రముఖ లైవ్ స్టాట్యూ ఆర్టిస్ట్ డాక్టర్ ఎ.రాజేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి తన తల్లిని కోల్పోయిన విషాదకర సంఘటనను పంచుకున్నారు.
వైద్యుల నిర్లక్ష్యం వల్ల తన తల్లిని కోల్పోయానని, ఇలాంటి విషయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లక్డికాపూల్‌లోని ఓ మెడికల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌కు 2020నవంబర్‌లో సాధారణ యాంజియోగ్రామ్ కోసం నడుచుకుంటూ తన తల్లి శారద(76)ను తీసుకుని వెళ్ళగా తిరిగి సజీవంగా రాలేదని చెప్పారు.
కార్డియాలజీ వైద్య నిపుణుల నిర్లక్ష్యం, సేవా లోపం వల్ల తన తల్లి శారద చనిపోయిందని చెప్పారు. వినియోగదారుల పరిష్కార కమిషన్ దీర్ఘకాల వాదనలు, సాక్ష్యాధారాల అనంతరం వారిని దోషులుగా తేల్చి జరిమాన విధించిందని చెప్పారు. తన పోరాటం డబ్బు కోసం కాదు.. వైద్య వృత్తిలో ఉన్నవారు బాధ్యతలను మరిచి వ్యవహరిస్తున్నందుకేనని చెప్పారు. తల్లి జ్ఞాపకాలు పదిలంగా ఉండాలని, తన కళా నైపుణ్యంతో 25 చిత్రాలను వేర్వేరు పద్దతులలో చిత్రించానని చెప్పారు.