చెరువుల పరిరక్షణకు తామే బ్రాండ్ అంబాసిడర్లమంటూ బఫర్ జోన్, అక్రమ కట్టడాల పేరిట నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా, రాష్ట్ర సర్కార్ తన ఖజానా నింపుకొనేందుకు ఏకంగా మూసీకి గురి పెట్టింది. రూల్స్ సమాన్యులకే తప్ప తమకు వర్తించవన్న చందంగా హెచ్ఎండీఏ విభాగం ద్వారా మూసీ బఫర్ జోన్లో వందల ఎకరాల్లో ఓ భారీ వెంచర్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. తన వద్ద భూములు లేకున్నా.. రైతుల నుంచి పెద్ద ఎత్తున భూములను సమీకరించి మూసీ బఫర్ జోన్ పరిధిలోనే వెంచర్ డెవలప్ చేసేందుకు హెచ్ఎండీఏ కసరత్తు చేస్తోంది. సామన్యులకు ఒక రూల్.. ప్రభుత్వానికి ఒక రూల్ అన్నచందంగా మూసీ బఫర్‌జోన్‌లో హెచ్ఎండీఏ ఏర్పాటు చేయనున్న వెంచర్‌కు సంబంధించి ‘నమస్తే తెలంగాణ’ స్పెషల్ స్టోరీ మీకోసం..
కాంగ్రెస్ పాలనలో చట్టాలన్నీ సామాన్యులకే తప్పా… పెద్దలు, ప్రభుత్వాలకు ఏమాత్రం వర్తించవు. అధికారం చేతిలో ఉందనే భావనతో… చెరువుల ఆక్రమణల పేరిట సామాన్యులను మూడు చెరువుల నీళ్లు తాపిస్తున్న సర్కార్ తనవరకు వచ్చేసరికి రూల్స్ మాకు వర్తించవు అనేవిధానాన్ని అవలంభిస్తోంది. మూసీకి 200 మీటర్ల వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదనే పేరిట ఆంక్షలు విధించిన కాంగ్రెస్ సర్కార్… తాను రూపొందించిన నియమాలనే కాలరాస్తూ మూసీ వెంబడి భారీ వెంచర్లు నిర్మించేందుకు సిద్ధం అవుతోంది. ఆదాయం కోసం ఏకంగా మూసీ పరీవాహక ప్రాంతానికి 100 మీటర్ల దూరంలోనే భారీ వెంచర్‌ను తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.
నిబంధనలకు పాతర..
జలవనరులకు 200 మీటర్ల దూరంలో ఉండే ప్రాంతాన్ని బఫర్ జోన్‌గా నిర్ధారిస్తూ ఆరు నెలల కిందట ఎల్ఆర్ఎస్ విషయంలో ఆంక్షలు పెట్టింది. దీని కోసం ప్రత్యేక జీవోను జారీ చేస్తూ నిబంధనలు తీసుకువచ్చింది. కానీ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను పాతరేసినట్లుగా హెచ్ఎండీఏ ఏకంగా మూసీకి 100 మీటర్ల దూరంలోనే వందల ఎకరాల భూములను సమీకరించి వెంచర్ డెవలప్ చేస్తోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండల పరిధిలోని ప్రతాప సింగారం గ్రామంలో 130 ఎకరాల విస్తీర్ణంలో వెంచర్ నిర్మించేందుకు సిద్ధమైంది.
వంద మీటర్ల దూరంలోనే వెంచర్ నిర్మించనుంది. దీనికి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ నుంచి క్లియరెన్స్ కోసం ఏకంగా హెచ్ఎండీఏ కమిషనర్ జూన్ 13న Lr.no.518/LPS/HMDA/2022/P Date/13.06.25 పేరిట లేఖ రాసింది. మూసీ పరీవాహక ప్రాంతంలో లే అవుట్‌కు అనుమతించాలని, బఫర్ జోన్ విషయంలో ఎక్కడా లేని నిబంధనలు తీసుకువచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు… భారీ వెంచర్ నిర్మించేందుకు సిద్ధమవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
పేదలకు ఓ రూల్, పెద్దలకు మరో రూల్..
అయినోళ్లకు ఆకుల్లో… కానోళ్లకు కంచంలో వేసినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం.. చట్టాలు, నిబంధనలను కాలరాయడం ఇదేమి కొత్తేమి కాదు. గతంలోనూ దుర్గం చెరువు సమీపంలో ఉన్న నిర్మాణాలన్నింటికి ఆక్రమణల పేరిట మార్కింగ్ చేసిన హైడ్రా… ఇప్పటివరకు ఆ ఇండ్ల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. పేదోడు ఇంట్లో ఉన్న సామాన్లు సర్దుకునే సమయం కూడా ఇవ్వకుండా… బుల్డోజర్లను తీసుకెళ్లిన సర్కార్… అదే పెద్దల విషయంలో కోర్టు స్టేలు తీసుకునేంత సమయాన్నిచ్చి వారి నిర్మాణాలకు పహారా కాసింది. ఇక చెరువుల ఆక్రమణలను వ్యతిరేకిస్తూ, హైడ్రా కూల్చివేతలను సమర్థిస్తూ… డిప్యూటీ సీఎం మల్లు భట్టి ఏకంగా బడా రియల్ ఎస్టేట్ సంస్థలను టార్గెట్ చేశారు.
నగరంలోని 15 ప్రధాన చెరువు భూముల్లో బడా రియల్ ఎస్టేట్ సంస్థలు నిర్మాణాలు చేశాయని కుండ బద్ధలు కొట్టారు. ఇలా నగరంలో చెరువుల ఆక్రమణల పేరిట ఎన్నో సార్లను నిబంధనలు అతిక్రమించింది. పేదలను కొట్టి.. పెద్దలకు కొమ్ము కాస్తున్న రేవంత్ సర్కారు పనితీరుకు హెచ్ఎండీఏ కమిషనర్ తాజాగా రాసిన లేఖనే నిదర్శనంగా నిలుస్తోందని పలువురు పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చెరువుల సంరక్షణ పేరిట పేదల ఇండ్లను కూలగొడుతూనే.. మరోవైపు వందల ఎకరాల విస్తీర్ణంలో భారీ వెంచర్లు చేసేలా నిబంధనలను అతిక్రమించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.