ఖైరతాబాద్, ఫిబ్రవరి 14: భూమి రాసివ్వనందుకు తనపై కొందరు కక్షగట్టి తప్పుడు కేసులతో జైలుపాలు చేశారని బాధిత రైతు వెంకన్న దంపతులు వాపోయారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు.
నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం తాటికల్ గ్రామంలో తమ కుటుంబం నివాసం ఉంటుందని, తన స్వార్జితంతో పాటు కొంత వారసత్వంగా వచ్చిన ఆరు ఎకరాల భూమిని సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని తెలిపారు. స్థానికంగా నివాసం ఉండే పీడీఎస్ బియ్యం బ్లాక్ మార్కెట్ చేసే వ్యక్తి తన భూమి నుంచి ఒక ఎకరాన్ని పట్టా చేయాలని వేధించడం ప్రారంభించాడని పేర్కొన్నారు. అందుకు ససేమిరా అనడంతో తన భార్య, కుటుంబ సభ్యులపై దాడులు చేశారని చెప్పారు. తాము కేసుపెడితే స్పందించని పోలీసులు దాడి చేసిన వ్యక్తులు అక్రమ కేసులు పెడితే అరెస్టు చేసి జైలుకు తరలించారన్నారు. తన భూమిని ఎలాగైనా రాయించుకోవాలని అన్ని రకాలుగా వేదింపులకు పాల్పడుతున్నారని చెప్పారు.
తమకు జరిగిన అన్యాయంపై ఇప్పటికే స్థానిక సీఐకి తొమ్మిది సార్లు, డీఎస్పీకి రెండు, ఎస్పీకి పది, ఐజీకి ఒక ఫిర్యాదు చేశామన్నారు. డీజీపీకి నాలుగు సార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని వాపోయారు. చివరకు తమ జిల్లాకు చెందిన మంత్రిని కలిసి వివరించామని.. ఆయన ఫోన్ చేసినా అధికారుల్లో ఎలాంటి చలనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దాడి చేయడంతో పాటు కేసులు పెట్టించిన వ్యక్తుల వెనుక స్థానిక అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఉన్నాడని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయంతో పాటు అధికారులు స్పందించకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 21న తాము ఇందిపార్కు వద్ద ధర్నా చేస్తామని తెలిపారు.