మేడ్చల్, మే20 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే ఉపేక్షించేంది లేదని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ హెచ్చరించారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ చర్యల్లో భాగంగా జిల్లాలో 8 వందల అక్రమ నిర్మాణాలను గుర్తించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ స్థలాల్లో ఈ సంవత్సరంలోనే వివిధ ప్రాంతాల్లో నిర్మించిన 395 అక్రమ కట్టడాలను కూల్చివేసినట్లు వివరించారు. మరో 405 అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇటీవల సంవత్సరంలోపు నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు గుర్తిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. గుర్తించిన ఆక్రమణలపై తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు.