Welfare Board Schemes | చిక్కడపల్లి, సెప్టెంబర్ 23: భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డు స్కీమ్‌లను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వొద్దని, ప్రభుత్వ బోర్డు ద్వారా కార్మికులకు సంక్షేమ పథకాలను అందజేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని కార్మికశాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
భారతీయ రాష్ట్ర కార్మిక సంఘం(బీఆర్టీయూ), తెలంగాణ బిల్డింగ్, అండర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్( సీఐటీయూ), స్ఫూర్తి భవన నిర్మాణ కార్మిక సంఘం (ఎస్బీఎన్కేఎస్), తెలంగాణ ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం (ఐఎఫ్టీయూ), తదితర సంఘాల ఆధ్వర్యంలో వందలాదిగా కార్మికులు తరలివచ్చి.. కార్మిక శాఖ కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ మాట్లాడుతూ.. నిర్మాణ కార్మికుల సంక్షేమానికి బోర్డు అమలు చేస్తున్న నాలుగు సంక్షేమ పథకాలను ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వకుండా.. ప్రభుత్వమే కార్మికులకు సంక్షేమ పథకాలు అందజేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్టీయూ రాష్ట్ర నాయకులు నారాయణ, మారయ్య, సీఐటీయూ నాయకులు కాటం రాజు, వంగురు రాములు, ఎస్బీఎన్కేఎస్ గౌరవ అధ్యక్షుడు కుమార్, చంద్రమౌళి, ఐఎఫ్టీయూ నాయకులు అన్వేశ్, అనురాధ, భారత కార్మిక సంఘాల సమాఖ్య నాయకులు అరెల్లి కృష్ణ, విజయ్, పోలెరాజు, జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.