మేడ్చల్ కలెక్టరేట్, మే 30 : బడిబాట కార్యక్రమాన్ని జూన్ 3 నుంచి ప్రారంభించనున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి వెల్లడించారు. ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో 3 నుంచి 19వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. తొలిరోజు గ్రామస్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రతిజ్ఞ చేయడం, 4న బడీడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం కల్పించి.. గ్రామస్థాయిలో రిజిష్టర్‌లో పేరు నమోదు చేయడం, 5 నుంచి 10వ తేదీ వరకు గడప గడప ప్రచారం, అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం, బడిబాటపై కరపత్రాలు, బ్యానర్లతో ప్రచారం, బడి బయట ఉన్న పిల్లలను గుర్తించి, పాఠశాలలో చేర్పించే కార్యక్రమాలు ఉంటాయన్నారు.
11న గ్రామసభలు నిర్వహించి, బడిబాట కార్యక్రమాన్ని సమీక్షిస్తామన్నారు. 12న పాఠశాల సుందరీకరణ, పండుగ వాతావరణం నెలకొల్పడం, తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేసి, అమ్మ ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన పనులను ప్రారంభించడం, పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు, ఏకరూప దుస్తుల పంపిణీ, 13న ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాలు, పుస్తకపఠనం, 14న సామూహిక అక్షరాభ్యాసం, బాలసభలు, 15న దివ్యాంగులను భవిత సెంటర్లలో, బడి బయట పిల్లలను పాఠశాలలో చేర్పించడం, విద్యార్థుల ప్రవేశాలను పెంపొందించడం, 18న డిజిటలైజేషన్‌పై, ఆంగ్ల మాధ్యమంపై విద్యార్థులకు అవగాహన, 19న స్పోర్ట్స్ డే నిర్వహించి, విద్యార్థులకు వివిధ క్రీడల్లో పాల్గొనేలా చేయడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తామని జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి వివరించారు. తేదీల వారీగా కార్యక్రమాలను అమలు చేసి, బడిబాటను విజయవంతం చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు.