మేడ్చల్, జూన్ 10(నమస్తే తెలంగాణ): వర్షాకాలం సమీపిస్తున్నందున వచ్చే మూడు నెలలు జాగ్రత్తగా ఉండాలని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చారు. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో సోమవారం మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ గౌతమ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షకాల ప్రణాళికలను సిద్ధం చేసి అమలు చేయాలని తెలిపారు.
వర్షాకాలంలో ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేసి వరద నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. మ్యాన్ హోల్స్, నాలాల పూడిక తీత పనులను ఎమర్జెన్సీ బృందాలు గుర్తించి మున్సిపల్ కమిషనర్లకు సమాచారం అందించాలన్నారు. నాలాల పూడిక తీత పనులను త్వరితగతిన పూర్తి చేసి డ్రైనేజీలను శుభ్రపరచాలన్నారు. చెరువులు ఉన్నచోట ఎఫ్టీఎల్ బౌండరీలను ఏర్పాటు చేసి పిల్లర్లు కట్టి పెయింటింగ్ వేయాలని కలెక్టర్ గౌతమ్ సూచించారు. మ్యాన్ హోల్స్‌ను ఎప్పుడు మూసి ఉంచే విధంగా చూడాలన్నారు. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.