రంగారెడ్డి, జూలై 5 (నమస్తే తెలంగాణ) : ఫార్మాసిటీ ఏర్పాటు కోసం భూములిచ్చిన రైతు ల ప్లాట్ల పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట్ వద్ద ఫార్మా బాధిత రైతుల కోసం ప్లాట్ల కేటాయింపునకు సర్వేనంబర్ 90లో సుమారు ఆరువందల ఎకరాల్లో వెంచర్‌ను ఏర్పాటు చేశా రు. గత బీఆర్ఎస్ హయాంలో ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతులకు పరిహారంతోపాటు ఎకరానికి 121 గజాల చొప్పున స్థలం ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీలో భాగం గా మీర్ఖాన్పేట్ సమీపంలోగల బేగరికంచ వద్ద అత్యాధునిక వసతులతో వెంచర్‌ను ఏర్పా టు చేశారు. ఈ వెంచర్లో దాదాపుగా 5800 మంది రైతులకు ప్లాట్లను మొదటి విడతలో అందజేయనున్నారు.
ప్లాట్ల పంపిణీ సజావుగా జరిగేలా..
ఫార్మాసిటీకోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్ల పంపిణీ సజావుగా జరిగేలా కలెక్టర్ నారాయణరెడ్డి.. జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, డీపీవో సురేశ్‌మోహన్, డీఆర్డీఏ శ్రీలత, ఇబ్రహీంపట్నం, కందుకూరు ఆర్డీవోలు అనంతరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డిలకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు. ఆయా డివిజన్ల పరిధిలోని గ్రామాల వారీగా భూములు కోల్పోతున్న రైతుల జాబితాలను తీసుకుని వారిలో అర్హులకే పట్టాలిచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు ఆయా రెవెన్యూ డివిజన్ల పరిధిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి.. గ్రామాల వారీగా రైతుల పేర్లను చదివి జాబితాల్లో పేరున్న వారంతా సోమవా రం మీర్ఖాన్పేట్ వద్ద లాటరీ పద్ధతిలో నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని సూచిస్తున్నారు.
పంపిణీ పారదర్శకంగా జరగాలి
ఫార్మాసిటీ కోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్ల పంపిణీ పారదర్శకంగా జరగాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట్ వద్ద ఫార్మా రైతుల కోసం తయారుచేసిన ప్లాట్ల వెంచర్‌ను పరిశీలించారు. వెంచర్ సమీపంలో రైతుల కోసం డ్రా ఎలా నిర్వహించాలన్న దానిపై అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్లాట్ల పంపిణీలో పొరపాట్లు జరగొద్దన్నారు. ఫార్మాసిటీకి భూములిచ్చిన రైతుల వివరాలను ఆయా గ్రామపంచాయతీల్లోని నోటీసు బోర్డుల్లో ఉంచాలన్నారు. ప్లాటు మంజూరైన ప్రతి రైతుకూ సమాచారమిచ్చి వారి సమక్షంలోనే లాటరీ తీయాలన్నారు. డ్రా పద్ధతి ద్వారా నంబర్లు వచ్చిన రైతులకు ఆయా ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామన్నారు. అందులో రైతులకు అనుమానాలు వద్దన్నారు.
-నారాయణరెడ్డి, రంగారెడ్డి కలెక్టర్
ఫార్మా ప్లాట్లకు అర్హులైన రైతులు యాచారం మండలం
గ్రామం : అర్హులైన రైతులు
కుర్మిద్ద : 1240
నానక్‌నగర్ : 359
మేడిపల్లి : 1601
తాటిపర్తి : 545