“వెనుకబడిన కులాలు, చేతి వృత్తుల వారి జీవితాలు బాగుండాలని తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికతో రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నది.చేతి వృత్తుల వారికి ఈ సాయం వారి పనిముట్లు, ముడిసరుకు కొనేందుకు దోహదపడుతుందని, వారి చేతిలోని కళ ద్వారా ప్రభుత్వం అందించిన సాయంతో వారు ఆర్థికంగా ఎదిగేందుకు దోహద పడాలని ప్రభుత్వం యంత్రాంగం ఆశిస్తున్నది. అయితే, ఈ నగదు పంపిణీ పథకం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఈ పథక పంపిణీని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు.”
మేడ్చల్, జూలై 15(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన కులాలలోని చేతి వృత్తుల వారి అభ్యున్నతికి పాటు పడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.లక్ష ఆర్థిక సహాయ పథకాన్ని ప్రవేశపెట్టి పలు చేతి వృత్తుల వారికి చేయూతను ఇస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాల్లో మొదటి విడత బీసీ కుల చేతివృత్తుల లబ్ధిదారులకు రూ.లక్ష ఆర్థిక సహాయ చెక్కులను శనివారం మంత్రి మల్లారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, అభిషేక్ అగ్యస్త, బీసీ సంక్షేమాధికారి కేశురాంలతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ వెనుకబడిన తరగతులు (బీసీ) సంక్షేమానికి పెద్ద పీట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు.
వృత్తికి సంబంధించిన ఆధునిక పనిముట్లు, ముడిసరుకు కొనుగోలు చేసుకుని ఉపాధి అవకాశాలను పెందపొందించుకుని ఆర్థికంగా ఎదగాలని మంత్రి మల్లారెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని కులాల ఆర్థికాభివృద్ధికి అనేక పథకాలు ప్రవేశపెట్టారని, అందులో దళితులకు దళిత బంధు, గొల్ల కుర్మలకు మేకలు, గొర్రెలు, మత్స్య కార్మికులు వ్యాపారాలు చేసుకునేలా వాహనాలు, పనిముట్లను అందిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం, బీసీలకై లక్ష రూపాయల ఆర్థిక సహాయం పథకం ఎంతో దూరదృష్టితో ఆలోచించి ఆర్థికాభివృద్ధిని సాధించేలా పథకాల రూపకల్పన చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అనుక్షణం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి పరితపిస్తుంటారని దేశంలోనే బెస్ట్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. మేడ్చల్ నియోజకవర్గానికి చెందిన 50 మంది లబ్ధిదారులకు మొదటి దశలో ఆర్థిక సహాయం అందించారు.
ఆర్థికంగా నిలదొక్కుకుంటాం
రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమానికి ఈ పథకం ద్వారా సహాయం చేయడం ఎంతో ఆనందంగా ఉంది. దీనిని సక్రమంగా వినియోగించుకుని ఆర్థికంగా నిలదొక్కుకుంటాం. గతంలో ఉన్న ప్రభుత్వాలు ఏనాడు బీసీ సంక్షేమానికి కృషి చేయలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్కు రుణపడి ఉంటాం. తెలంగాణ రాష్ర్టానికి
ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండటం అదృష్టంగా భావిస్తున్నాం.
– సంతోష్ కుమార్, లబ్ధిదారుడు, పోచారం
సహాయాన్ని సద్వినియోగం చేసుకుంటాం
ప్రభుత్వం అందించిన రూ.లక్ష ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుంటం. నేను చేసే వృత్తికి సీఎం సారు చేసిన సాయం మరింత ఎదిగేందుకు ఎంతగానో దోహదపడుతుంది. టైలరింగ్ వంటి వృత్తిని ఎంచుకుని ఆర్థికంగా ఎదగడానికి శ్రమిస్తాం. ఈ విషయంలో ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్కు ఎల్లప్పుడు రుణపడి ఉంటాం.
– కవిత, లబ్ధిదారురాలు, మేడ్చల్
ఆర్థిక సహాయంతో అభివృద్ధి సాధిస్తాం
ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయంతో అభివృద్ధి సాధిస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మేము ఆర్థికంగా అభివృద్ధి చేందేలా ఆయన అందించిన సాయం ఊరికే పోదు. సీఎం కలలను నిజం చేసేలా కష్టపడతాం. బీసీలందరికి ఇలాంటి పథకాన్ని వర్తింపజేయడం సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ సారుకు ఎంతో రుణపడి ఉంటాం.
– మనోద, లబ్దిదారురాలు, భోగారం