దుండిగల్, సెప్టెంబర్ 20: గ్రేటర్ పరిధిలో రెండవ విడత డబుల్‌బెడ్ రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమం గురువారం జరగనుంది. గండిమైసమ్మ-దుండిగల్ మండలంలోని దుండిగల్‌లో నిర్మించిన డబుల్ ఇండ్ల పంపిణీని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) ప్రారంభించి.. పట్టాలను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో డబుల్ ఇండ్ల వద్ద నిర్వహించ నున్న సమావేశానికి సంబంధించిన సభ ఏర్పాట్లల్లో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావుతో పాటు జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ సభా ఏర్పాట్లను పరిశీలించారు. సమావేశాన్ని సజావుగా నిర్వహించేందుకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. దుండిగల్‌లో మొ త్తం 3,996ఇండ్లు ఉండగా గురువారం 1800 ఇండ్లను మంత్రి కేటీఆర్ పంపిణీ చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, సనత్‌నగర్ నియోజకవర్గాల ప్రజలకు 500ల చొ ప్పున, కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు 300 ఇండ్ల ను పంపిణీ చేస్తారన్నారు. ఆయా నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు ఈ నెల 2న 1700 ఇండ్లను మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ బహదూర్‌పల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పంపిణీ చేసిన విషయం విధితమే.
దుండిగల్‌లో నిర్మించిన డబుల్ ఇండ్లను గురువారం లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్ పంపిణీ చేయనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్థానిక నేతలతో మాట్లాడుతూ.. ఇక్కడ నిర్మించిన డబుల్ ఇండ్లలో దుండిగల్ వాసులకు 10శాతం ఇండ్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. సుమారు 400 ఇండ్లను దుండిగల్ గ్రామంలోని నిరుపేదలకు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నా రు. ఇందులో భాగంగా ఈ నెల 27న దుండిగల్ వాసులకు డబుల్ఇండ్ల పంపిణీ జరుగుతుందన్నారు.
దుండిగల్‌లో మంత్రి కేటీఆర్ డబుల్బెడ్రూం ఇండ్లు పంపిణీ చేయనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ బుధవారం అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, మల్కాజ్గిరి ఆర్డీవో శ్యాంప్రకాశ్లతో కలిసి సభాఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సభకు హాజరయ్యే అతిథులతో పాటు లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు.