మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 1 : ఇందిరమ్మ ఇండ్ల పత్రాల పంపిణీ కార్యక్రమం రసాభాస అయ్యింది. కాంగ్రెస్ నాయకుల మధ్య వివాదం తలెత్తింది. నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మల్లేశ్ యాదవ్ వేదికపై మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు న్యాయం చేసేందుకు ఇండ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తుందని, ఎలాంటి అపోహలు పడకుండా లబ్ధిదారులు ఇండ్లు నిర్మించుకోవాలన్నారు.
ఇంతలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ గౌడ్ మధ్యలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాలేదని, వేదిక మధ్యలో వచ్చి మల్లేశ్ యాదవ్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఎంతమంది అర్హులకు ఇండ్లు మంజూరు అయ్యేయో చేతులు ఎత్తాలని కార్యక్రమానికి హాజరైన వారిని కోరారు. అనంతరం మైకును గుంజుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువురి మధ్య వివాదం తలెత్తింది. చివరకు ఇరువురి వాదోపవాదాల మధ్య రసాభాసగా కార్యక్రమం ముగిసింది.