మల్కాజిగిరి, మార్చి 26: మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న ‘వక్ఫ్‌బోర్డు’ ఆస్తి సంబంధిత సమస్యలపై అసెంబ్లీలో గురువారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ప్రస్తావించారు. నియోజకవర్గంలో సుమారు 384 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 76 కాలనీలను వక్ప్‌బోర్డు ఆస్తులుగా ప్రకటించడంతో సమస్యలు వస్తున్నాయని తెలిపారు. 2024 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ శాఖవారు సంబంధిత భూమిని 22-ఏ కింది నిషేధిత జాబితాలో చేర్చారని సభ దృష్టికి తీసుకువచ్చారు. దీని ద్వారా 18 వేలు ఇండ్ల యాజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఇప్పటికే ప్రాపర్టీ ట్యాక్స్ నంబర్లు కలిగిన ఇండ్ల యాజమానులు బ్యాంకు లోన్లు పొందడం, మార్టిగేజ్ చేయడం, ఇండ్లు అమ్మడం, అదనపు అంతస్తులు నిర్మించడంపై అవరోధాలు ఎదురవుతున్నాయని తెలిపారు. సమస్యకు పరిష్కారం లేకపోవడంతో ప్రజలు కోర్టులను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. కోర్టు ద్వారా అనుమతులు పొందేందుకు భారీగా ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. కోర్టు ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని వివరించారు. ఈ భూములపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆస్తి లావాదేవీలు సాఫీగా జరిగేవిధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. సమస్యలను సంబంధిత మంత్రి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని మర్రి తెలిపారు.
అల్వాల్, మార్చి 26: చట్టసభల పట్ల విద్యార్థుల్లో అవగాహన పెంచే ఉద్దేశంతో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి అల్వాల్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులను గురువారం అసెంబ్లీకి తీసుకెళ్లారు. విద్యార్థులకు వివిధ అంశాలపై ఆయన వివరించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎలా పాలన నిర్వహిస్తారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధుల పాత్ర ఏమిటి? అనే అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణ్, ఉపాధ్యాయులు.. మురళీకృష్ణ, సంగీత, రమాదేవి, సబిత, స్థానిక బీఆర్ఎస్ నాయకులు నేమూరి శ్రీధర్‌గౌడ్, తోట నరేందర్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, శరణ్‌గిరి, అమూల్, సాగర్, నర్సింహ పాల్గొన్నారు.