సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులో ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థ్ధిస్తూ ఐదుగురు దోషులకు తెలంగాణ హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. బాంబు పేలుళ్ల కేసులో దోషుల పిటిషన్‌ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ప్రధాన నిందితుడు రియాజ్ బత్కల్ పరారీలో ఉండగా, మిగతా అహ్మద్ సిద్దిబప్ప జరార్ అలియాస్ యాసిన్ బత్కల్, అబ్దుల్లా అక్తర్ అలియాస్ హద్ది, తహసీన్ అక్తర్, జియాఉర్‌రెహమాన్, అజిజ్షేక్ అనే ఐదుగురు నిందితులకు 2016లో ఎన్ఐఏ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఉరిశిక్షను విధించింది.
ఎన్ఐఏ కోర్టు తీర్పును రద్దు చేయాలని నిందితులు హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లారు. వాదనల తరవాత మంగళవారం ఆ ఐదుగురు నిందితులు చేసిన అప్పీళ్లను తిరస్కరిస్తూ.. ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. ఈ తీర్పు నేపథ్యంలో పేలుళ్ల ఘటనలో మృతులు, బాధితుల కుటుంబాలతో పాటు నగర ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పు కచ్చితంగా తమకు కొద్దిపాటి ఉపశమనం ఇచ్చినా తిరిగి నిందితులు హైకోర్టును ఆశ్రయించడంతో తీర్పుపై ఉత్కంఠ ఉండేదని, హైకోర్టు కూడా నిందితుల అప్పీల్‌ను డిస్మిస్ చేసి అదే శిక్షను సమర్ధించడం తమకు ఆనందంగా ఉందని బాధిత కుటుంబాలు చెప్పాయి.
దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21న మొదటి పేలుడు రాత్రి 7గంటల సమయంలో మలక్‌పేట పీఎస్ పరిధిలోకి వచ్చే 107 నంబర్ బస్‌స్టాప్ వద్ద జరిగింది. కొద్ది క్షణాల వ్యవధిలోనే కోణార్క్ థియేటర్ సమీపంలోని ఏ 1 మిర్చి సెంటర్ వద్ద రెండో పేలుడు సంభవించింది. ఈ పేలుళ్ల ధాటికి మొత్తం 18 మంది మృత్యువాత పడగా, 131 మంది గాయపడ్డారు. ఈ పేలుడుపై సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి అప్పట్లో దర్యాప్తు ప్రారంభించారు. ఈ పేలుళ్ల ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని భావించినా, కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (జాతీయ దర్యాప్తు సంస్థ)ను రంగంలోకి దించింది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నమోదైన రెండు కేసులు ఎన్ఐఏకి బదిలీ అయ్యాయి. దర్యాప్తు ప్రారంభించిన ఎన్ఐఏ ఈ పేలుళ్లకు పాల్పడింది ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థగా గుర్తించింది. దర్యాప్తులో భాగంగా అహ్మద్ సిద్దిబప్ప జరార్ అలియాస్ యాసిన్ బత్కల్, అబ్దుల్లా అక్తర్ అలియాస్ హద్ది, తహసీన్ అక్తర్, జియాఉర్‌రెహమాన్, అజిజ్షేక్ అనే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పేలుళ్లకు కీలకసూత్రధారి అయిన మహ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ బక్తల్ ఇప్పటికీ పాకిస్తాన్లో తలదాచుకున్నట్లుగా ఎన్ఐఏ గుర్తించి అతడిపై రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. ఈ ఐదుగురు నిందితులను దోషులుగా గుర్తించిన ఎన్ఐఏ కోర్టు 2016 డిసెంబర్ 19న వారికి జైలుశిక్ష, జరిమానాలతో పాటు ఉరిశిక్ష విధించింది. కాగా ఎన్ఐఏ కోర్టు తీర్పుపై నిందితులు అదే ఏడాది తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం హైకోర్టు నిందితుల అప్పీల్‌ను డిస్మిస్ చేస్తూ ఎన్ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.