సిటీబ్యూరో, మే 31(నమస్తే తెలంగాణ) : పారదర్శకతకు పంగనామం పెడుతూ.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిర్మాణ విధానాన్ని అంత గోప్యంగా మార్చేశారు. అందుబాటులో ఉన్న టీజీబీపాస్ కంటే మరింత సులభతరమైన విధానం బిల్డ్ నౌ అని చెప్పుకుంటూ ప్రభుత్వం చేస్తున్న జాప్యం హెచ్ఎండీఏలో దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతులు ఇస్తున్నామని చెబుతున్నా.. షార్ట్ ఫాల్స్ కారణంగా ఎదురయ్యే సమస్యల పురోగతి తెలుసుకునే వీల్లేకుండా పోతున్నది.
దీంతో దరఖాస్తుదారులు కార్యాలయానికి అనివార్యంగా రావాల్సి వస్తున్నదని వాపోతున్నారు. గతంలో అమలులో ఉన్న డీపీఎంఎస్, టీజీబీపాస్లో దరఖాస్తు చేసిన వాటి పురోగతి తెలుసుకునే అవకాశం లేకుండా ఆ రెండు సైట్లు కూడా మొరాయించడంతో భవన నిర్మాణ అనుమతుల కోసం హెచ్ఎండీఏ కార్యాలయానికి అటు అర్కిటెక్చర్లు, ఇటు నిర్మాణదారులు చక్కర్లు కొడుతున్నారు.
భవన నిర్మాణ అనుమతులను ఏఐ విధానంతో మరింత సరళీకరిస్తూ తీసుకువచ్చిన బిల్డ్ నౌ ఇంకా పూర్తి స్థాయిలో హెచ్ఎండీఏలో అమలులోకి రాకపోవడంతో దరఖాస్తుదారులకు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో డీపీఎంఎస్, టీజీబీపాస్ ద్వారా దరఖాస్తు చేసి, నిర్మాణ అనుమతుల కోసం ఎదురుచూస్తున్న వారికి… ఇప్పుడు ఆ ఫైల్ ఏ దశలో ఉందనే విషయాన్ని తెలుసుకోవడానికి కార్యాలయానికి రావాల్సి వస్తోంది. పాత విధానంలోని టీజీబీపాస్ కానీ, డీపీఎంఎస్ ద్వారా వచ్చిన దరఖాస్తులు, వాటి పురోగతి, షార్ట్ ఫాల్స్ వంటి రిమార్కులతో సహా తెలుసుకునే విధంగా ఆ సైట్లలో సదుపాయం ఉండేది. కానీ బిల్డ్ నౌ వస్తుందనే సాకుతో… ఆ రెండు సైట్ల నిర్వహణను గాలికొదిలేశారు. దీంతో హెచ్ఎండీఏ పరిధిలో దరఖాస్తుదారులకు కొత్త సమస్యలను ఎదుర్కొంటున్నారు.
కొత్తగా అమలులోకి వచ్చిన బిల్డ్ నౌ వెబ్సైట్ కూడా సాంకేతిక సమస్యలతో మొరాయిస్తున్నది. సిటిజన్ సెర్చ్ వినియోగించాలంటే ఓటీపీ సమస్యలతో ప్రక్రియ ముందుకు సాగడం లేదు.పాత దరఖాస్తుల సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే హెచ్ఎండీఏ డీపీఎంఎస్, టీజీబీపాస్ సైట్లు తెరుచుకోవడమే గగనమైంది. ఇక ఎంతో కీలకమైన చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్, ల్యాండ్ యూజ్, బిల్డింగ్ అప్రూవల్స్ తెలుసుకునే అవకాశం లేకుండా పోవడంతో.. తెర వెనుక ఏం జరుగుతుందోననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.