శంషాబాద్ రూరల్, జనవరి 4: మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా నాయకుడు నీరటి మల్లేశ్ డిమాండ్ చేశారు. శంషాబాద్ మున్సిపల్ కార్మికులు కార్యాలయం ఎదుట శనివారం ఆందోళన చేశారు. ఇందుకు హాజరైన సీఐటీయూ జిల్లా నాయకుడు నీరటి మల్లేశ్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు కనీస వేతనంగా రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్క హామీ కూడా అమలు చేయలేదని విమర్శించారు.
కార్మికులు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నా, వారికి తక్కువ వేతనాలు ఇస్తుండటంతో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు. వారికి అందుతున్న తక్కువ జీతాలతో కుటుంబ పోషణకు సరిపోక అప్పులు చేస్తున్నట్లు తెలిపారు. కనీస వేతనం పెంచనిచో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మున్సిపల్ అధ్యక్షుడు ప్రవీణ్, జిల్లా సలహాదారు నగేశ్, జయేందర్, యాదమ్మ, సుజాత, రవి, రాజులతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.