హైదరాబాద్ : రాష్ట్రంలోని గెస్ట్ లెక్చరర్స్(Guest Lecturers) ఆందోళన బాటపట్టారు. గెస్టు లెక్చరర్లకు ఉద్యోగ భద్రత కల్పిం చాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్(Intermediate Board Office) ఎదుట ఆందోళన చేపట్టారు. అతిథి అధ్యాపక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గెస్ట్ లెక్చరర్స్ తరలి వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.
జేఎల్ నోటిఫికేషన్తో సంబంధం లేకుండా రూ.42వేల వేతనంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని పేర్కొన్నారు. మహిళ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని1654 మంది గెస్ట్ లెక్చరర్లకు భద్రత కల్పించి రెన్యువల్(Renewal) చేసి విధుల్లో కొనసాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. 10 సంవత్సరాలుగా నిరంతరం విద్యార్థులకు విద్య అందిస్తూ..విద్యావ్యవస్థలో అనేక మార్పులు తెచ్చామ న్నారు. లెక్చరర్స్ ఆందోళనతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.