హైదరాబాద్, జనవరి 13: రక్తం అవసరమైన వారికి తక్షణమే దాతలను అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో రూపొందించిన ‘కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్’ వెబ్ అప్లికేషన్‌ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి ప్రారంభించారు. రక్తదాతలు – పేషెంట్ల మధ్య వేగంగా సమాచారం అందేలా ఈ వెబ్ యాప్‌ను రూపొందించారు. రక్తం అవసరమైన సమయంలో దాతను గుర్తించే సాంకేతిక సదుపాయం ఈ అప్లికేషన్లో అందుబాటులో ఉంది. రక్తదాతల వివరాలు గోప్యంగా ఉండే విధంగా, ఆధునిక సాంకేతికతతో ఈ యాప్‌ను అభివృద్ధి చేశారు.
ఈ వెబ్ అప్లికేషన్లో రక్తదాతల వ్యక్తిగత వివరాలకు పూర్తి భద్రత ఉంటుంది. రక్తదానం చేసిన తరువాత నిర్దిష్ట కాలం వరకు వారి వివరాలు కనిపించకుండా ఉంచే సదుపాయం, అలాగే అత్యవసర పరిస్థితుల్లో త్వరగా దాతను గుర్తించే వ్యవస్థ వంటి ప్రత్యేక ఫీచర్లను ఈ యాప్‌లో పొందుపరిచారు. ‘కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్’ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ వెబ్ యాప్ ద్వారా రక్తదానం ప్రక్రియను మరింత సులభతరం చేసి, అవసరమైన వారికి సమయానికి రక్తం అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ యాప్ ద్వారా ప్రాణాలు నిలిపేందుకు పాటుపడుతున్న ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చింతల సంపత్‌ను డీజీపీ అభినందించారు. కాల్ ఫర్ బ్లడ్ ఫౌండేషన్ డాట్ కామ్(www.callforbloodfoundation.com) వెబ్ సైట్ నుండి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చని సంపత్ తెలిపారు.