సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర డీజీపీ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ నెల 9న కురిసిన కుండపోత వర్షంతో సైబరాబాద్‌లో రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోగా.. అర్ధరాత్రి వరకు గంటల తరబడి వాహనదారులు రోడ్లపైనే ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కుకున్న ఘటనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన డీజీపీ సీవీ.ఆనంద్ శనివారం సాయంత్రం వర్షం కురవగా సైబరాబాద్ పరిస్థితులను పరిశీలించేందుకు స్వయంగా రంగంలోకి దిగారు.
వర్షం నీరు నిలిచి, ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడే ప్రాంతాలపై ఆరా తీసిన ఆయన మల్కం చెరువు పరిసరాలను పరిశీలించారు. గతంలో సైబరాబాద్ సీపీగా పనిచేసి, స్థానిక స్థితిగతులపై అనుభవం ఉన్న డీజీపీ ఆనంద్ సైబరాబాద్‌లో ట్రాఫిక్ నిర్వహణపై స్థానిక సీపీ రమేష్‌కు పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేస్తూ రోడ్లపై వర్షం నీరు నిలువకుండా, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరంలోని వాటర్‌లాగింగ్ ప్రాంతాలను శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్, ట్రాఫిక్ డీసీపీలు అవినాశ్‌కుమార్, కాజల్‌లతో కలిసి లక్డీకాపూల్, మసబ్‌ట్యాంక్, పంజాగుట్ట శ్మశానవాటిక, కేబీఆర్ పార్క్ జంక్షన్ తదితర వాటర్ లాగింగ్ పాయింట్లను పరిశీలించారు.
రోడ్లపై వర్షపు నీరు నిల్వ ఉండకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని, నీరు సులువుగా పోయేలా తగిన ఏర్పాట్లు చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించారు. భారీ వర్షాలు కురిసే సమయంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సీపీ కోరారు. రోడ్లపై ప్రయాణించేటప్పుడు మ్యాన్‌హోల్స్, తెరిచిన డ్రైనేజీలు, విద్యుత్ స్తంభాల పట్ల ప్రజలు, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగర ప్రజలకు ఏదైనా అత్యవసర సహాయం లేదా ఇబ్బంది ఎదురైతే తక్షణ సహాయం కోసం డయల్ 100/112ను సంప్రదించాల్సిందిగా సీపీ సూచించారు.