ఖైరతాబాద్, ఆగస్టు 30 : ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు శనివారం భక్తులు పోటెత్తారు. వీకెండ్ కావడంతో లక్షలాదిగా తరలివచ్చారు. మింట్ కాంపౌండ్, వార్డు ఆఫీసు, రైల్వే గేటు నుంచి ఏర్పాటు చేసిన క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి.. ఖైరతాబాద్ చౌరస్తాలో క్యూలైన్ దాటి జనం క్యూకట్టారు. మధ్యాహ్నానికే సుమారు రెండు లక్షలకు పైగా భక్తులు దర్శించుకోగా, రాత్రి 11 గంటల వరకు మూడున్నర లక్షల మంది దర్శించుకొని ఉంటారని చెబుతున్నారు.
కాగా, మహాగణపతిని యూఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు సింగరి రాజ్ కుమార్, మహేశ్ యాదవ్, మహేందర్ బాబు, వీణామాధూరి మహాగణపతి ప్రస్థానాన్ని వివరించారు. అనంతరం ఆమెను ఘనంగా సత్కరించారు.