Khairatabad Ganesh | సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి దర్శనానికి ఆదివారం లక్షల్లో భక్తులు తరలివచ్చారు. అయితే జనం పోటెత్తడంతో పోలీసులు వారిని అదుపు చేయడంలో విఫలమయ్యారు. మహాగణపతిని దర్శించుకొని ఐమాక్స్, మింట్ కాంపౌండ్లకు వెళ్లే దారుల్లో భక్తుల మధ్య తోపులాటలు, స్వల్పంగా తొక్కిసలాటలు జరిగాయి. పలువురు వృద్ధులు, మహిళలు సొమ్మసిల్లిపడిపోయారు.
వారిని బయటకు తీసుకువచ్చేందుకు పోలీసుల తరం కాలేదు. భక్తుల సాయంతో వారికి సపరియాలు చేశారు. ఇక అధిక సంఖ్యలో భక్తులు రావడంతో పరిసర ప్రాంతాల్లోని కూడళ్లన్నీ ట్రాఫిక్‌తో నిండిపోయాయి. ఖైరతాబాద్‌కు సుమారు 3 మూడు కిలోమీటర్ల పరిధిలో భక్తులు, వారు వచ్చిన వాహనాలతో రహదారులన్నీ నిండిపోయాయి. అయితే ఆదివారం రాత్రి వరకే దర్శనానికి అనుమతి ఉండటంతో పాటు సెలవు దినం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు దర్శనానికి వచ్చారు.
అయితే ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని నిర్వాహకులు, పోలీసులు అంచనా వేయలేకపోయారనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే వృద్ధులు, పిల్లలు రద్దీలో చిక్కుకొని విలవిలాడారు. తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీకి తోడు వీఐపీల దర్శనం కూడా ఉండటంతో పరిస్థితి చేయి దాటింది. సాయంత్రానికి భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నది. చాలా మంది వృద్ధులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.