Golconda Bonalu | మెహిదీపట్నం, జూలై 14: గోల్కొండలో కొలువైన జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ అమ్మవారికి భక్తులు ఆదివారం మూడో బోనం సమర్పించారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు నగరం నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో గోల్కొండ కోట కిటకిటలాడింది. మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, చింతల్‌బస్తీ, పురానాపూల్, నానల్‌నగర్, లంగర్‌హౌస్, రాజేంద్రనగర్,
గండిపేట తదితర ప్రాంతాల నుంచి భక్తులు తొట్టెలను ఊరేగింపుగా తెచ్చి.. అమ్మవారికి సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా దక్షిణ, పశ్చిమ మండలం డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఈవో శ్రీనివాస్ రాజు, బోనాల ఉత్సవ కమిటీ చైర్మన్ కాంత అరవింద్ మహేశ్‌కుమార్, బోనాల కులవృత్తుల సంఘం అధ్యక్షుడు సాయిబాబాచారి ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. అమ్మవారికి చేసిన పుష్పాలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.