ప్రపంచంలోని విశ్వ నగరాల్లో భౌగోళిక అనుకూలతలు ఉన్న పిడికెడు నగరాల్లో హైదరాబాద్ ఒకటి. ఇలాంటి నగరానికి అంతర్జాతీయ హంగులు అద్దాలంటే చిత్తశుద్ధి కావాలి. అంతకుమించి.. ఇది ‘మా నగరం’ అనే అంకితభావం ఉండాలి. గత పాలకుల్లో అదే లోపించింది. అందుకే 2004 నుంచి 2014 వరకు పదేండ్ల కాలంలో నగరాభివృద్ధికి అప్పటి ప్రభుత్వం రూ.22వేల కోట్ల పైచిలుకు ఖర్చు పెడితే.. కేవలం ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఏకంగా దాదాపు రూ.88వేల కోట్ల వరకు వెచ్చించింది. ఫలితంగానే.. అనేక రంగాల్లో దేశంలోని మెట్రో నగరాలను వెనక్కి నెట్టి భారీ ఎత్తున అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారింది. రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం విడుదల చేసిన 2014-24 పదేండ్ల ప్రగతి నివేదికలో ఇలాంటి ఆసక్తికర అంశాలు ఎన్నో ఉన్నాయి.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 5 (నమస్తే తెలంగాణ)
స్వరాష్ట్ర పాలనలో హైదరాబాద్ మహానగరం అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కించుకున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకంలో మంత్రి కేటీఆర్ నాయకత్వంలో విశ్వనగరాల సరసన చేరింది.శరవేగంగా విస్తరిస్తున్న మహానగరంలో మౌలిక వసతుల కల్పన, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదేండ్ల కాలంలోనే ఏకంగా రూ. 88 వేల కోట్లు ఖర్చు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం పదేండ్ల కాలంలో నగరాభివృద్ధికి రూ. 22 వేల కోట్లు ఖర్చు చేస్తే.. బీఆర్ఎస్ సర్కారు తొమ్మిదేండ్ల కాలంలో నాలుగింతలు ఎక్కువ ఖర్చు చేసింది. పదేండ్ల ప్రస్థానంలోనే వందేండ్ల ప్రగతి సాధించి భాగ్యనగరాన్ని విశ్వవిజేతగా నిలిపింది. ప్రపంచ స్థాయి పెట్టుబడులకు హైదరాబాద్ మహానగరాన్ని కేంద్ర బిందువుగా మార్చింది.
– సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 5 (నమస్తే తెలంగాణ)
వాకింగ్, సైక్లింగ్ ప్రోత్సహించడమే లక్ష్యంగా హెచ్ఎండీఏ, బల్దియా ఆధ్వర్యంలో వాహనరహిత రవాణా మౌలిక వసతుల పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికోసం బల్దియా పరిధిలో నాలుగేళ్లలో రూ.29.5 కోట్ల వ్యయంతో 9 ఫెట్ ఓవర్ బ్రిడ్జీలను పూర్తి చేయగా.. మరో 13 బ్రిడ్జీలు పలు దశల్లో ఉన్నాయి. ఇక ఓఆర్ఆర్ వెంబడి సోలార్ రూఫ్‌టాప్‌తో సైకిల్ ట్రాక్‌ను హెచ్ఎండీఏ-గ్రోత్ కారిడార్ ఆధ్వర్యంలో నిర్మించింది. 4.5 మీటర్ల వెడల్పుతో 23కిలోమీటర్ల పొడవైన సైకిల్ ట్రాక్‌ను నిర్మించారు. తొలి దశలో టీఎస్పీఏ నుంచి నార్సింగి అక్కడి నుంచి కొల్లూరు వరకు విస్తరించేలా ప్రాజెక్టును చేపట్టారు. మెహిదీపట్నం, ఉప్పల్ జంక్షన్ వద్ద ఎలివేటెడ్ పెడిస్ట్రీయన్ వాక్ వేను నిర్మించారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్‌కు గుదిబండల మారుతున్న వీధి దీపాల బిల్లుల భారాన్ని తగ్గించేలా ఎల్ఈడీ ప్రాజెక్టును చేపట్టింది. 2017లో చేపట్టి ఈ ప్రాజెక్టు ద్వారా నగరంలో 5,24,102 ఎల్ఈడీ లైట్లను ఇన్స్టాల్ చేశారు. దీంతో నెలవారీ సగటు ఇంధన వినియోగం 20 మెగా యూనిట్ల నుంచి 9.96 మెగా యూనిట్లకు తగ్గింది. 2017 నుంచి ఇప్పటివరకు రూ.5,24,102 కోట్లు బల్దియాకు మిగిలాయి. కేబుల్ బ్రిడ్జి, మొజంజాహీ మార్కెట్, శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్ వంటి ప్రాంతాలలో డెకొరేటివ్ లైటింగ్ ఏర్పాటు చేసి మరింత ఆకర్షణీయంగా మార్చారు.
పట్టణ పునరుద్ధరణ, పునరుజ్జీవనంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ‘చార్మినార్ అర్బన్ పునరుద్ధరణ ప్రాజెక్ట్’ చేపట్టింది. మలేషియా ఆధారిత ప్రభావ సంస్థ థింక్ సిటీ సహకారంతో ఈ ప్రాజెక్టును ఎన్ఐయూఎం నిర్వహిస్తున్నది. ఇక్కడి క్లస్టర్లు, సాంస్కృతిక ఆస్తులను గుర్తించడానికి సర్వే కూడా చేపట్టింది. తాగునీరు సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ద్వారా కొత్త లైన్ వేసి అండగా నిలిచింది. నిరుద్యోగ మహిళలకు ఉపాధి చూపింది.
కుతుబ్‌షాహీ హెరిటేజ్ పార్క్, క్లాక్టవర్స్ను పరిరక్షించడంతో పాటు పర్యాటకంగానూ వాటిని సుందరీకరణతో తీర్చిదిద్దారు. దీనిని పరిరక్షించంలో భాగంగా 25 ఎకరాల విస్తీర్ణంలో ల్యాండ్ స్కేప్ చేశారు. అంతేకాదు ఈ ప్రాజెక్టు యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డు ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ నుంచి డిస్టింక్షన్ అవార్డును అందుకోవడం విశేషం. పార్క్ ఆవరణలో జీహెచ్ఎంసీ 500 సీట్ల యాంపి థియేటర్‌ను అభివృద్ధి చేసింది. మరోవైపు మహబూబ్ చౌక్ క్లాక్ టవర్‌ను పునరుద్ధరించారు. శాలిబండ క్లాక్ టవర్‌ను కూడా పునరుద్ధరించారు.
చెత్త రహిత నగరాలలో భాగంగా స్టార్ రేటింగ్‌లో జీహెచ్ఎంసీ ‘3స్టార్ సిటీ’గా అవార్డు పొందింది. బెస్ట్ సెల్స్ సైస్టెనబుల్ మెగా సిటీ అవార్డును పొందింది. జీహెచ్ఎంసీకి వాటర్‌ఫ్లస్ సర్టిఫికెట్ లభించింది. సిటీజన్ ఫీడ్‌బ్యాక్‌లో ఉత్తమ మెగా సిటీగా జీహెచ్ఎంసీ అవార్డు పొందింది. 2019లో స్వచ్ఛ్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నది.
అంతిమ దహన సంస్కారాలను నిర్వహించుకునేందుకు వైకుంఠ ధామాలను ఆధునీకరించారు. ఉప్పల్‌లోని ఫతుల్లాగూడలో మత సామరస్యానికి ప్రతీకగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్లు ఆయా వర్గాల వారీగా అంతిమ సంస్కారాలు నిర్వహించుకునేలా నిర్మించారు. కాంపౌండ్ వాల్, వాష్, బర్నింగ్ ఫ్లాట్ ఫారం, వెయిటింగ్, పార్కింగ్, సిట్టింగ్ ఏరియాలతోపాటు ఎన్నో సౌకర్యాలను కల్పిస్తూ రూ.11.77 కోట్లతో హెచ్ఎండీఏ నిర్మిస్తున్నది. వీటితోపాటు బల్దియా పరిధిలో 8ఏళ్లలో రూ.44.4 కోట్లతో 31 మోడల్ వైకుంఠ ధామాలను అభివృద్ధి చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళలతో డిజిటల్ మార్కెటింగ్ వర్క్‌షాప్ నిర్వహించి వారి ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి అండగా నిలిచింది. చార్మినార్ సర్కిల్లోని వివిధ స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఎన్ఐయూఎం బృందం హస్తకళల విక్రయానికి డిజిటల్ మాధ్యమాలను ఉపయోగించి టైలరింగ్, ఎంబ్రాయిడరీ తదితర సేవల్లో శిక్షణ ఇచ్చింది. వారికి వ్యాపార యాప్‌లను ఇన్స్టాల్ చేయడంపై అవగాహన కల్పించారు.
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగు రోడ్డు పెట్టుబడులకు కేంద్ర బిందువుగా మారింది. అంతర్జాతీయ ప్రమాణాలతో మెరుగైన మౌలిక వసతులు కల్పించడంతో కొత్తగా నివాసాలు, వ్యాపార వాణిజ్య కేంద్రాలు ఔటర్ చుట్టూనే ఏర్పాటవుతున్నాయి. 2009 నుంచి దశల వారీగా నిర్మాణ పనులు పూర్తి చేసుకున్న ఓఆర్ఆర్ 2018 నాటికి కండ్లకోయ వద్ద 1.1 కి.మీ మార్గంతో మొత్తం 158 కి.మీ మేర పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. ప్రతియేటా ఓఆర్ఆర్ చుట్టూ పలు అభివృద్ధి కార్యక్రమాలను హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ చేపడుతూనే ఉన్నది.
తెలంగాణ ప్రభుత్వం లాస్ట్ మైల్ కనెక్టివిటీని మెరుగుపర్చడం, ప్రజా రవాణా వినియోగాన్ని పెంచడానికి వినూత్న కార్యాచరణ ప్రణాళికలతో దూసుకుపోతున్నది. టీఎస్ఆర్టీసీ, స్విడ మొబిలిటీ సర్వీసెస్‌తో ఈ-ఆటో రిక్షాలు, టాటా మినీ బస్సు సేవలను ప్రారంభించింది. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో హెచ్ఎండీఏ, ట్రక్‌డాక్ సంయుక్తంగా బాటసింగారం, మంగల్‌పల్లిలో లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేసింది. క్రమశిక్షణ ప్రయాణానికి సిటీ వైడ్ యూనిఫైడ్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్(ఏటీఎస్సీ) సిస్టమ్ అధ్యయనం, డిజైన్, సరఫరా, ఇన్స్టాలేషన్, టెస్టింగ్, కమీషనింగ్, ఆపరేషన్స్, నిర్వహణ చేపట్టింది. ఇప్పటివరకు 111 ఏటీఎస్సీ, 78 పెలికాన్ సిగ్నల్స్‌ను ఏర్పాటు చేశారు. ఈవీ వాహనదారులకు ఇబ్బందులు లేకుండా జీహెచ్ఎంసీ, టీఎస్ రెడ్కో సంయుక్తంగా 100 ఈవీ స్టేషన్లను ప్రారంభించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది.