సిటీ బ్యూరో/ వెంగళరావునగర్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): పందేండ్ల బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ చేసిన అభివృద్ధి పనులు నేటికీ సాక్షాత్కరిస్తున్నాయి. నియోజకవర్గం వ్యాప్తంగా ఏ డివిజన్‌కు వెళ్లినా.. ఏ గల్లీని చూసినా మాగంటి ముద్ర స్పష్టంగా దర్శనిమిస్తుంది. మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసి నియోజకవర్గ ప్రజల్లో చెరగని ముద్ర వేశారు మాగంటి. నియోజకవర్గ పరిధిలో ఏండ్ల తరబడిగా కబ్జాకోరల్లో చిక్కుకున్న వందలాది ఎకరాల భూములకు విముక్తి కలిగించారు. కబ్జాల నుంచి విడిపించిన భూములను అభివృద్ధి చేసి నియోజకవర్గ ప్రజలుకు కానుకగా ఇచ్చారు.
అందులో ప్రముఖంగా నిలిచేది కళ్యాణ్ నగర్ థీమ్ పార్కు. కబ్జాలో కూరుకుపోయిన 2,900 గజాల ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమణదారుల నుంచి విడిపించి అందులో రూ.2 కోట్ల వ్యయంతో సువిశాల, సుందరమైన పార్కు ఏర్పాటు చేశారు. నేడు ఆ పార్కు వెంగళరావు నగర్ డివిజన్ ప్రజలకు వినియోగంలోకి వచ్చింది. పిల్లల నుంచి పెద్దల దాకా అందరికీ ఆహ్లాదాన్ని పంచుతూ మాగంటి గోపీనాథ్ సేవలకు నిదర్శనంగా నిలుస్తున్నది. వెంగళ్‌రావ్‌నగర్ డివిజన్ ప్రజలు ఆ పార్కుకు మాగంటి గోపీనాథ్ పేరును పెట్టి ఆయనకు అంకితం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
వెంగళరావునగర్ డివిజన్లోని ఫేజ్-1లో ఉన్న 2,900 గజాల స్థలం ఏండ్ల తరబడిగా కబ్జా కోరల్లో చిక్కుకుంది. దాన్ని విడిపించుకునేందుకు ఆ కాలనీవాసులు సుదీర్ఘంగా పోరాటం చేశారు. కాలనీ ప్రజల పోరాటానికి స్థానిక ఎమ్మెల్యే మాగంటి మద్దతుగా నిలిచారు. భూమిని దక్కించుకునేందుకు కబ్జాకోరులు మాగంటి గోపీనాథ్‌ను అన్ని రకాలుగా ప్రలోభాలకు గురిచేసినా ఆయన లొంగలేదు. నోట్ల కట్టలు ఆశచూపినా ప్రజలకిచ్చిన మాటకు కట్టుబడి భూబకాసురులను ఆ స్థలం నుంచి తరిమేశారు.
ప్రజలకు బాసటగా నిలిచి స్థలాన్ని పేదలకు దక్కేలా చేశారు. కబ్జాదారుల చెర నుంచి విడిపించిన ఆ స్థలాన్ని జీహెచ్ఎంసీకి కాలనీవాసలు గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ చేశారు. కాలనీవాసుల సహృదయాన్ని అర్థం చేసుకున్న దివంగత మాగంటి గోపీనాథ్ ఆ స్థలంలో పార్కు నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారు. రూ.2 కోట్ల నిధులను తక్షణం మంజూరు చేసి ప్రకృతి రమణీయంగా, సువిశాలంగా అన్ని వసతులు కల్పిస్తూ థీమ్ పార్కును అధునాతనంగా తీర్చిదిద్దారు. అప్పట్లో ఆయనే స్వయంగా ప్రారంభించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి కేటీఆర్ సహకారంతో కళ్యాణ్‌నగర్‌లో మాగంటి గోపీనాథ్ థీమ్ పార్క్ నిర్మించారు. ఈ ప్రాంతంలో ఇంతటి అందమైన పార్క్ అందుబాటులోకి రావడానికి ఆయన సేవా గుణం, అంకితభావానికి నిదర్శనం. పిక్నిక్ స్పాట్‌లా పార్కును తీర్చిదిద్దాం.
– దేదీప్య, కార్పొరేటర్, వెంగళరావు నగర్
కళ్యాణ్‌నగర్ థీమ్ పార్క్‌కు దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ థీమ్ పార్క్‌గా నామకరణం చేయాలి. పార్కు నిర్మాణానికి విశేష కృషి చేసినందుకు ఆయన పేరు పెట్టి ఘనమైన నివాళులర్పించాలి. వెంగళ్రావునగర్ స్థానికులంతా ఈమేరకు బల్దియా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
– సత్యనారాయణ, కళ్యాణ్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు