సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ ) : రాబోయే వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా చేపట్టిన స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులు, అసంపూర్తిగా ఉన్న నాలా అభివృద్ధి పనులన్నింటినీ పూర్తి చేసేందుకు పూర్తి చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. గురువారం ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌తో కలిసి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ నాగోల్ సాయి నగర్ నుంచి ఆర్టీఓ ఆఫీస్ వరకు సుమారు 350 మీటర్ల స్టార్మ్ వాటర్ బాక్స్ డ్రెయిన్ పనులు, ఉప్పల్ ఎస్ఆర్డీపీ నేషనల్ హైవే ఫ్లైఓవర్ పనులు, బైరామల్ గూడ ఫ్లైఓవర్ కింద బ్లాక్‌లో వివిధ క్రీడలను ప్రోత్సహించేందకు చేపట్టిన పనులు పరిశీలించారు. ఎల్బీనగర్ జోన్లో లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు నివారణకు చేపట్టిన స్టార్మ్ వాటర్ డ్రెయిన్లు, ఎస్ఎన్డీపీ ద్వారా చేపట్టిన నాలా అసంపూర్తి పనులన్నింటిని వచ్చే వర్షాకాలం లోపు పూర్తి చేసేందుకు తగిన అన్ని చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు.
బైరామల్ గూడ ఫె్లైఓవర్ కింద బ్లాక్‌లో క్రీడలను ప్రోత్సహించేందుకు 6 బ్లాక్‌లలో చేపట్టనున్న పనులను పరిశీలించి క్రీడాకారులకు ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాలని సూచించారు. స్టార్మ్ వాటర్ నిర్మాణం వలన ఎన్ని కాలనీలకు ప్రయోజనం కలుగుతుందని కమిషనర్ ఈఈ రమేశ్ బాబును వివరణ కోరగా సుమారు 5 కాలనీలో వరద ముంపు నివారణ అవుతుందని ఈఈ కమిషనర్‌కు వివరించారు. ఎప్పటి వరకు పూర్తి అవుతుందని కమిషనర్ ఈఈని అడుగగా నెల రోజుల్లో పూర్తి అవుతుందని వివరించారు.
వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేయాలని కమిషనర్ ఈఈని ఆదేశించారు. అనంతరం ఉప్పల్ చౌరస్తా వద్ద ఎస్ఆర్డీపీ ఫ్లైఓవర్ పనులతో పాటుగా నేషనల్ హైవే నారాపల్లి సీపీఆర్ఐ వరకు చేపట్టిన పనులను కూడా ఈ సందర్భంగా కమిషనర్ పరిశీలించారు.కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, హయత్ నగర్, ఉప్పల్ డిప్యూటీ కమిషనర్లు తిప్పర్తి యాదయ్య, ఆంజనేయులు, ఇంజినీరింగ్ మెయింటెనెన్స్ ఈఈలు కార్తీక్, రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.