కేపీహెచ్‌బీ కాలనీ, జనవరి 18 : అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మంగళవారం కూకట్పల్లి జంట సర్కిళ్ల కార్యాలయంలో జడ్సీ మమత, డీసీలు రవికుమార్, రవీందర్‌కుమార్, జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లతో కలిసి అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం దిశగా చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఏమిటని ప్రశ్నించారు. నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించినా.. ఆ పనులు పెండింగ్‌లో ఉంటున్నాయన్నారు.
అసంపూర్తి పనులను వేగవంతం చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. పనులు చేయడానికి నిధులు అవసరమైతే సీఎం కేసీఆర్‌తో మాట్లాడి.. తీసుకొచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. వర్షంనీటి కాలువలు, రోడ్లు, డ్రైనేజీ పనులు ఆగిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అలాగే కాలనీలు, బస్తీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సమస్యాత్మక ప్రాంతాలలో వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గుత్తేదారుల ఇబ్బందులను అధికారులు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో ఇంజినీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.