మేడ్చల్/శామీర్‌పేట/జవహర్‌నగర్, జూలై 11: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం సీఎంకేసీఆర్కే సాధ్యమన్నారు. మేడ్చల్ మున్సిపాలిటీ, శామీర్‌పేట, జవహర్‌నగర్‌లో మంత్రి మంగళవారం పర్యటించారు.మేడ్చల్‌లోని వివిధ వార్డులో రూ.2.13 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేశారు. మూడు చింతలపల్లి మండలంలో రూ.కోటితో నిర్మిస్తున్న కేశవాపూర్- తూం కుంట బీటీ రోడ్డు పనులకు భూమి పూజ, ఉద్దెమర్రి, ఆద్రాస్‌పల్లి, కేశవాపూర్,అనంతారంగ్రామాల్లో సీసీ రోడ్లు, కుల సంఘాల భవనాలు, ఆలయ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు.
జవహర్‌నగర్ కార్పొరేషన్‌లోని స్వయం సహాయక సంఘాలకు రూ.12 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభ ల్లో మంత్రిమాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీలు అద్భుత ప్రగతి సాధించాయన్నారు. రోడ్డు, మురికికాల్వలు,వీధి దీపాలు, డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలు బీఆర్ఎస్ హయాంలోనే సాధ్యమయ్యాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. వేరే రాష్ర్టాల్లో కూడా సీఎం కేసీఆర్ సత్తా చాటుతారన్నారు.
మహిళా భాగస్వామ్యంతో సమాజం అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌ను కల్పించడంతో పరిపాలనా దక్షత చూపుతున్నారన్నారు. మహిళల రక్షణలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం కల్పించే రుణ సదుపాయంతో మహిళలు వ్యాపారంలో రాణించాలని సూచించారు. జవహర్‌నగర్ కార్పొరేషన్లో డ్వాక్రా భవనం ఏర్పాటుకు మూడెకరాల స్థలం కేటాయించి విశాలమైన భవన నిర్మాణం చేసేందుకు కృషి చేస్తానన్నారు. డంపింగ్ యార్డ్‌లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ, కలుషితమైన నీటిని స్వచ్ఛమైన నీరుగా మారుస్తున్నామన్నారు. జవహర్‌నగర్‌లో త్వరలో 324 ఎకరాల్లో హెచ్ఎండీఏ లేఔట్ ప్రారంభం కానుందన్నారు. దానితో జవహర్‌నగర్‌కు కార్పొరేషన్‌కు ఆదాయం సమకూరుతుందని, తద్వారా మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.
సీఎం కేసీఆర్ మూడు చింతలపల్లి మండలంలోని లక్ష్మాపూర్, మూడు చింతలపల్లి, కేశవరం, లింగాపూర్ తండా, నాగిశెట్టిపల్లి గ్రామాలను దత్తత తీసుకుని రూ.69 కోట్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. వెనుకబడి ఉన్న కేశ్వాపూర్, ఆద్రాస్‌పల్లి, ఉద్దెమర్రి, అనంతారం, నారాయణపూర్, పోతారం, జగ్గంగూడ గ్రామా ల్లో తన సొంత నిధులతో అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చామకూర మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో పర్యటన కొనసాగింది. మేడ్చల్ కార్యక్రమంలో చైర్పర్సన్ మర్రి దీపికా నర్సింహా రెడ్డి, వైస్ చైర్మన్ చీర్ల రమేశ్, మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ దుబ్బ రామస్వామి ముదిరాజ్, నాయకులు మర్రి నర్సింహారెడ్డి, మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మూడు చింతపల్లి కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లేశ్‌గౌడ్, వైస్ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, తహసీల్దార్ వాణిరెడ్డి, ఆర్ఐనరేశ్, సర్పంచ్‌లు లలితా నర్సిం హులు, అనురాధ రవీందర్‌రెడ్డి, ఇస్తారి, నర్సింహారెడ్డి, జామ్ రవి, విష్ణువర్ధన్‌రెడ్డి, హరిమోహన్‌రెడ్డి, కృపాకర్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ మధుకర్‌రెడ్డి, ఎంపీటీసీ నాగరాజు, కో ఆప్షన్ సభ్యుడు గౌస్‌పాషా, కౌడె మహేశ్, ఉప సర్పంచ్ జహంగీర్, కృష్ణారెడ్డి, మురళీగౌడ్, లక్ష్మీనారాయణ, సంతోష్ రెడ్డి, వార్డు సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జవహర్‌నగర్ కార్యక్రమంలో మేయర్ కావ్య, కమిషనర్ రామలింగం, బ్యాంకు అధికారులు, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ అధ్యక్షుడు కొండల్ ముదిరాజ్, మహిళా సంఘాల నాయకురాలు శోభారెడ్డి, మున్సిపల్, మెప్మా సిబ్బంది, మహిళలు ఉన్నారు.కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో పలువురి చేరికఅనంతారం గ్రామంలో ఉప సర్పంచ్ సీహెచ్ రాజు, ఉద్దెమర్రి గ్రామంలో 6వ వార్డు సభ్యులు కూరాకుల అంజమ్మతో పాటు 20 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.