బేగంపేట్ సెప్టెంబర్ 19: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఆలయంలో జరిగే అమ్మవారి చీరల టెండర్లలో కాంట్రాక్టర్కు, ఈవో మధ్య చెలరేగిన వివాదం సుప్రీం కోర్టుకు వరకు వెళ్లింది. ఈ దేవాలయంలో అమ్మవారికి వచ్చే చీరల టెండర్లను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తుండగా, వారు చెల్లించేది లక్షల్లో ఉంటే గుత్తేదారులకు మాత్రం కోట్లలో ఆదాయం తెచ్చి పెడుతున్నాయి.
ఇటీవల ఈ చీరలకు సంబంధించిన అంశంలోనే ఈవోకు గుత్తేదారుకు మధ్య వివాదం తలెత్తి సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. దీనిపై ఆరా తీయగా చీరల టెండర్లలో అమ్మ వారి ఆదాయానికి టెండర్ పెట్టిన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 2024-25 సంవత్సరానికి గాను చీరల టెండర్ రూ.48 లక్షలకు దక్కించుకోగా, అధికారులు రెండు నెలల చీరలకు లెక్కిస్తేనే 80 లక్షల ఆదాయం వస్తున్నట్టు గుర్తించారు.
ఏడాది మొత్తం లెక్కిస్తే రూ. 2 కోట్ల వరకు ఆదాయం వస్తున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఇలా ఉండగా, కాంట్రాక్టర్కు, ఈవోకు మధ్య వివాదం కోర్టులో నడుస్తుండగా చీరలను అధికారులు దేవాలయంలోనే భద్ర పరిచారు. అధికారులు ఇటీవల లెక్కించగా జూలై, ఆగస్టు రెండు నెలల్లోనే 16,175 చీరలు దేవాలయానికి వచ్చాయి.
ఇందులో రూ.10 నుంచి 15వేల చీరల వరకు రూ.5 వందల ధర గల చీరలు ఉన్నాయి. వీటిని లెక్కించగా, వీటి విలువ 80 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. దసరా నవరాత్రులో పాటు మిగతా కాలంలో లెక్కిస్తే అమ్మవారికి వచ్చే చీరల విలువ రెండు కోట్లు దాటే అవకాశం ఉంటుంది. అందుకు కాంట్రాక్టర్ కట్టిన డబ్బులు మొత్తం చెల్లిస్తానని అన్నా.. సదరు కాంట్రాక్టర్ చీరలే కావాలని పట్టుపడుతున్నట్టు తెలిసింది.