దుండిగల్, మే 1: వ్యాపార లావాదేవీల్లో బెదిరింపులకు పాల్పడుతున్న కరుడుగట్టిన పాతనేరస్తుడిని బాలానగర్ ఎస్ఓటీ, దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఓ పిస్తోల్, 13 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితో పాటు అతడికి సహకరించిన సహచరుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేడ్చల్ ఏసీపీ వెంకట్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి, డీ.పోచంపల్లిలోని 120 గజాలు కాలనీలో నివాసముండే మహ్మద్ ముజాహిద్ ఆలియాస్ ముజ్జు(51) రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇటీవల మాదాపూర్‌లో పిస్తోల్‌తో ఓ వ్యక్తిని కాల్చిచంపిన కేసులో నిందితుడు. మూడు నెలల కిందట జైలు నుంచి బెయిల్‌పై తిరిగి బయటకు వచ్చాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.
వ్యాపార లావాదేవీల్లో బెదిరింపులకు దిగడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ క్రమంలో తన సహచరుడు బిహార్‌కు చెందిన తున్నకుమార్ అలియాస్ తుండా ద్వారా బిహార్ నుంచి రూ.లక్ష వెచ్చించి దేశావాళీ పిస్తోల్‌తో పాటు 12 బుల్లెట్లు తెప్పించుకొని ఇంట్లో భద్రపరుచుకున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు దుండిగల్ పోలీసులు ఆదివారం రాత్రి ముజాహిద్ ఇంటిపై దాడులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లో సోదాలు నిర్వహించగా పిస్తోల్‌తో పాటు బుల్లెట్లు లభించాయి. వాటితో పాటు రెండు సెల్ఫోన్లను సీజ్ చేసి ముజాహిద్, తుండాలను రిమాండ్‌కు తరలించారు. ప్రధాన నిందితుడు కూకట్పల్లి, మాదాపూర్, దుండిగల్ పోలీస్స్టేషన్ల పరిధిలో అనేక నేరాలకు పాల్పడిట్లు తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు.