ఉస్మానియా యూనివర్సిటీ, జనవరి 8: భారత రాష్ట్ర సమితి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని తార్నాకలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్‌రెడ్డి, బీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ముందుగా డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయం వద్ద జెండా ఎగురవేసి బైక్ ర్యాలీగా బయల్దేరారు. ర్యాలీలో భాగంగా కింతి కాలనీ, తార్నాక చౌరస్తా, మాణికేశ్వరీనగర్, ఉస్మానియా యూనివర్సిటీ, రవీంద్రనగర్, పార్థి వాడ, శాంతినగర్, లాలాపేట, ఇసుకబావి తదితర ప్రాంతాల్లో బీఆర్ఎస్ జెండాలు ఎగురవేశారు. అనంతరం డిప్యూటీ మేయర్ క్యాంపు కార్యాలయం ఎదుట కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ను బూత్ స్థాయి నుంచి బలోపేతం చేయాలని కోరారు. రానున్న రోజుల్లో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేందుకు నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే నూతన బూత్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను సైతం చేపట్టిందని వివరించారు. వాటికి సంబంధించిన వివరాలను ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు, తార్నాక డివిజన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.