సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): ఆమె పేరు షర్మిలా.. హోదా డిప్యూటీ కలెక్టర్.. కానీ ఆమె తీరు మాత్రం వదల బొమ్మాళీ అంటూ.. సీటు ను పట్టుకుని వేలాడుతూ నే ఉన్నారు. ఎట్టకేలకు ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. బదిలీ స్థానం లో చేరకుండా మొండికేసిన సదరు అధికారిపై సీసీఎల్ఏ కమిషనర్ లోకేశ్ కుమార్ సస్పెన్షన్ వేటు వేశారు. హెచ్ఎండీఏలో సుదీర్ఘకాలంగా డిప్యూటేషన్‌పై డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఎం.షర్మిలా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె పదవీ కాలంలో అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ బాధిత ప్రజల నుంచి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లాయట. విజిలెన్స్ విభాగం నుంచి సీఎంవో వరకు ఆమె అవినీతి వ్యవహారాలపై ఫిర్యాదులు అందడంపై ఉన్నతాధికారులు అంతర్గత విచారణ సైతం చేశారు.
బదిలీ చేసినా హెచ్ఎండీఏలోనే తిష్ట..
అంతర్గత విచారణ తర్వాత అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆమెను బదిలీ చేశారు. ఇందులో భాగంగా కొంతకాలం క్రితమే ఉట్నూర్ రెవెన్యూ డివిజన్ అధికారిగా, అలాగే ఆదిలాబాద్ జిల్లా ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారిగా పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కాసులు కురిపించే హెచ్ఎండీఏ కుర్చీని వదలడం ఇష్టం లేని షర్మిలా.. ఉన్నతాధికారులు పలుమార్లు మౌఖికంగా ఆదేశించినా, కొత్త స్థానంలో చేరకుండా నిర్లక్ష్యం చేశారు. ప్రభుత్వ బదిలీ ఉత్తర్వులను పక్కనపెట్టి హెచ్ఎండీఏలో కొనసాగుతున్నారు. ఇక్కడే బదిలీ చేసిన స్థానంలో విధులు నిర్వర్తించకుండా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మ్యాపింగ్ ప్రక్రియపై తీవ్ర ప్రభావం పడటం, ఆమె అవినీతి చిట్టా నిండిపోవడంతో అనివార్యంగానే చర్యలు తీసుకున్నారు.
‘డిప్యూటేషన్’ అక్రమాలకు అదుపేది?
ప్రభుత్వానికి కాసులు కురిపించే హెచ్ఎండీఏ విభాగానికి ఒకసారి డిప్యూటేషన్ మీద వచ్చిన ఏ అధికారి కూడా ఇక్కడి సీట్లను వదలుకునేందుకు ఇష్టపడరు. ముఖ్యంగా ఇక్కడ రుచి మరిగిన తర్వాత సొంత శాఖల్లో పనిచేయలేనంత నిస్సాహాయత, నిస్సత్తువ డిప్యూటేషన్ అధికారుల్లో ఆవహిస్తున్నది. ఇలాంటివి ప్రోత్సహించడంలో హెచ్ఎండీఏ కమిషనర్, జాయింట్ కమిషనర్లు ఇద్దరు ముందు వరుసులో ఉంటారని ఉద్యోగుల్లో చర్చ నడుస్తోంది.
డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారులతోనే లావాదేవీలు జరపడంలో ఈ ఇద్దరు పోటీపడుతుంటారని, కనీసం సొంత విభాగంలో పనిచేసిన అర్హత కలిగిన ఏ ఒక్క అధికారికి కూడా సరైన హోదాలో కూర్చోనివ్వకుండా అంతర్గత బదిలీలు, అవసరమే లేని విధులు కట్టబెడతారనే చర్చ నడుస్తోంది. దీనికి ప్రధాన కారణం డిప్యూటేషన్‌పై వచ్చిన అధికారులు చూ పే ‘చొరవ’నే కారణమనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా హెచ్ఎండీఏలో కీలకమైన అకౌంట్స్, ఆర్ అండ్ డీతోపాటు, ఈఎంయూ, ఇంజినీరిం గ్, ప్లానింగ్ విభాగాలతోపాటు, ఇటీవల కాలం లో దాదాపు రూ. 100 కోట్ల టెండర్లు పిలిచిన అర్బన్ ఫారెస్ట్రీ విభాగంలో డిప్యూటేషన్ అధికారుల హవా… బీపీపీ అకౌంట్స్‌లో సిబ్బం ది చేతి వాటాల లెక్క అంతు చిక్కదని, కనీసం జేబులు నిండిన అధికారులకు కనీసం ఆ విషయాలు కూడా కనిపించవనే ఆరోపణలు ఉన్నాయి.
సస్పెన్షన్ వేటుతో సీరియస్..
ప్రభుత్వ ఆదేశాల ధిక్కరణ, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించారో లేక ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవడం లేదనే కారణాలో తెలియదు కానీ, మే 19న సీసీఎల్ఏ కమిషనర్ లోకేశ్ కుమార్ ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు షర్మిలా సస్పెన్షన్‌లో కొనసాగాలనీ, ఈ సమయంలో కమిషనర్ ముందస్తు అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్ విడిచి వెళ్లడానికి వీల్లేదని పేర్కొన్నారు. అయితే ఈ వదలా బొమ్మాళీ సస్పెన్షన్ ఉదంతం ఇప్పుడు రెవెన్యూ వర్గాల్లోనూ, హెచ్ఎండీఏలోనూ తీవ్ర సంచలనంగా మారింది.