సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో పాలన గాడి తప్పిందని అనడానికి ఇదో మచ్చుతునక మాత్రమే. ఆర్థిక సంక్షోభం పేరుతో కొత్త ప్రాజెక్టులు, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించని యంత్రాంగం… పాలన వ్యవహారాల్లోనూ అదే నిర్లిప్తతను వ్యక్తం చేస్తున్నారు. గడిచిన 11 నెలల వ్యవధిలో ముగ్గురు కమిషనర్లు మారడం, సాధారణ బదిలీలతో అదనపు కమిషనర్లు కొత్తగా రావడం, పాలనను సమర్థవంతంగా నడిపించే నాయకత్వం కొరవడటం వెరసి.. ప్రజాసమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ప్రధానంగా ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను సైతం పరిష్కరించలేని పరిస్థితి. ఇప్పటి దాకా మొత్తం ప్రజావాణిలో ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? ఎన్నింటికి పరిష్కారం చూపారు? అన్న నివేదికను వెల్లడించకపోవడం అధికారుల పనితీరును ప్రశ్నిస్తున్నది.
ఈ క్రమంలోనే ప్రతి ఏటా రూపొందించే వార్షిక బడ్జెట్‌పై పట్టింపులేని ధోరణి అవలంభిస్తున్నది. గత అక్టోబర్‌లోనే 2025-26 బడ్జెట్ రూపకల్పనపై దృష్టి సారించాల్సిన ఫైనాన్స్ విభాగం నవంబర్ వచ్చినా గ్రేటర్ బడ్జెట్ పై అంచనాల కసరత్తును ప్రారంభించకపోగా మల్లగుల్లాలు పడుతున్నది. ఉన్నతాధికారుల మధ్య సమన్వయ లోపం, కమిషనర్ ఇలంబరితి ఝార్ఖండ్ ఎన్నికల పరిశీలకులుగా ఉండటం, ఈ నెల 23తర్వాతే తిరిగి హైదరాబాద్‌కు వచ్చే పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంజినీరింగ్, అడ్వర్టైజ్ విభాగం, రవాణా, యూబీడీ, హెల్త్ వంటి విభాగాల నుంచి ప్రతిపాదనలు జీహెచ్ఎంసీ ఫైనాన్స్ విభాగానికి చేరలేదని తెలుస్తోంది. నిర్ణీత వ్యవధిలో బడ్జెట్ రూపకల్పన, ఆమోదం ఈ క్రమంలోనే వచ్చే ఏడాది జనవరి 10లోపు బడ్జెట్ ఆమోదం పొందడం కష్టసాధ్యమేనని అధికారులు భావిస్తున్నారు.
ప్రారంభం కాని బడ్జెట్ ప్రతిపాదనలు..
వాస్తవానికి అక్టోబర్‌లోనే బడ్జెట్ అంచనాలు రూపకల్పనపై కసరత్తును ప్రారంభించాలి. జీహెచ్ఎంసీ చట్టం -1955 ప్రకారం కార్పొరేషన్ బడ్జెట్ అంచనాలను ఈ నెలలో ఏ తేదీ తర్వాత బడ్జెట్ అంచనాలు, ప్రతిపాదనలపై కమిషనర్ నుంచి వివరణాత్మక సమాచారం స్టాండింగ్ కమిటీ ముందుకు రావాల్సి ఉంది. డిసెంబర్ 15వ తేదీలోపు వార్షిక బడ్జెట్ అంచనాలు స్టాండింగ్ కమిటీ ఆమోదించాలని చట్టం పేర్కొంటుంది. వచ్చే ఏడాది జనవరి 10 లోపు జనరల్‌బాడి మీటింగ్‌లో సభ్యుల ముందు చర్చ పెట్టి ఆమోద ముద్ర పొందాల్సి ఉంటుంది. మార్పులు, చేర్పుల అనంతరం ఫిబ్రవరి 20లోపు అంచనాలను మంజూరు చేయాల్సి ఉంటుందని చట్టం చెబుతున్నది. మార్చి 1లోపు కార్పొరేషన్ బడ్జెట్ అంచనాల సమాచారాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలి. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా కనబడుతున్నాయి. కొన్ని శాఖల ఆర్థిక విభాగానికి ప్రతిపాదనలు సమర్పించలేదు. బడ్జెట్ ప్రతిపాదనకు తొలుత స్టాండింగ్ కమిటీలో అనుమతి పొందాలి.
కమిషనర్ వచ్చిన తర్వాతే స్టాండింగ్ కమిటీ సమావేశం ఉంటుంది. బడ్జెట్‌పై మార్పులు, చేర్పులు, అనంతరం స్టాండింగ్ కమిటీ ఆమోదానికి కనీసం 20 రోజుల సమయం తీసుకోనుంది. ఆ తర్వాత జనరల్ బాడి సమావేశం తేదీని ప్రకటించడం, కనీసం 15 రోజుల ముందు కార్పొరేటర్ సభ్యులకు బడ్జెట్ ప్రతిపాదనలను అందజేయాల్సి ఉంటుంది. జనరల్ బాడి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించడం, సభ్యుల సలహాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని మళ్లీ అవసరమైన మార్పులు, చేర్పుల అనంతరం బడ్జెట్ అనుమతికి ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. దీంతో వచ్చే జనవరి రెండో వారం లోపు బడ్జెట్ ఖరారు అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. హౌసింగ్, జీహెచ్ఎంసీ బడ్జెట్ కలిపితే కొన్నేండ్లుగా పెరుగుతూ వస్తున్నది. 2021-22లో బడ్జెట్ అంచనాలు రూ.5600 కోట్లు, 2022-23లో బడ్జెట్ అంచనాలు రూ. 6,150 కోట్లు, 2023-24లో బడ్జెట్ అంచనాలు రూ. 6,224 కోట్లు, 2024-25లో రూ. 7,937 కోట్లు అంచనాతో బడ్జెట్ రూపొందించింది. అయితే 2025-26 వార్షిక బడ్జెట్ అంచనాలు దాదాపు రూ. 8500 కోట్ల వరకు ఉండే అవకాశాలు కనబడుతున్నాయని చర్చ జరుగుతున్నది.