GHMC | సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో జనం డెంగీ దోమలతో పడరాని పాట్లు పడుతుంటే.. జీహెచ్ఎంసీలోని కొందరు ఎంటమాలజిస్ట్ అధికారులు అవినీతికి తెరలేపి.. అందినంత దండుకుంటున్నారు. ఫాగింగ్ చేయకుండానే బ్లాక్ మార్కెట్‌కు డీజిల్ తరలించిన కూకట్పల్లి జోన్ సీనియర్ ఎంటమాలజిస్ట్ బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఫాగింగ్ సిబ్బంది అంతా ఎన్నికల విధుల్లో ఉన్న సమయంలో సదరు అధికారి ఫాగింగ్ చేసినట్టు బిల్లులు డ్రా చేసి.. ఖజానాకు కన్నం వేశారు. డీజిల్ అక్రమాలు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను జాబ్‌లోంచి తీసేస్తానంటూ బెదిరించి.. ఒక్కొక్కరి (ఈఎఫ్ఏ) నుంచి రోజుకు సగటున రూ.25వేలు వసూలు చేశారు.
సదరు మహిళా అధికారి ఆగడాలకు విసిగిపోయిన ఔట్సోర్సింగ్ సిబ్బంది డబ్బులు ఇచ్చి.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. కాగా, సదరు సీనియర్ ఎంటమాలజిస్ట్ గతంలో వరంగల్ జిల్లాలో పనిచేసిన సమయంలోనూ అవినీతి ఆరోపణలపై సస్పెండ్ అయ్యారు. డీఎంఓగా ప్రమోషన్ వచ్చినా.. వెళ్లకుండా డిప్యుటేషన్‌పైనే కొనసాగుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగిన ట్రాన్స్ఫర్లలో ఆమె బదిలీ అయి.. తిరిగి ఒక్క రోజులోనే తన స్థానాన్ని పదిలం చేసుకున్నట్లు ఉద్యోగులు చెబుతున్నారు. మొత్తంగా సదరు అధికారి అక్రమాలపై విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నది. నేడు కమిషనర్‌కు సమగ్ర నివేదికను సమర్పించే అవకాశాలు ఉన్నాయి.