సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో మళ్లీ డెంగీ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. గడిచిన నెల రోజుల్లోనే గ్రేటర్ వ్యాప్తంగా రెండువందలకుపైగా కేసులు నమోదైనట్లు తెలుస్తున్నది. ఇటీవల కురిసిన వానలతో మహానగరాన్ని దోమల దండు రాజ్యమేలుతున్న విషయం తెలిసిందే. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా గత సంవత్సరం కంటే ఈ సారి దోమల బెడద పెరగడంతో డెంగీ కేసులు కూడా అనూహ్యంగా పెరుగుతున్నాయి. దోమల నివారణ చర్యల్లో ఎంటమాలజీ విభాగం పూర్తిగా విఫలమవ్వడంతో రాత్రి, పగలు తేడా లేకుండా దోమలు విజృంభిస్తున్నట్లు ప్రజలు వాపోతున్నారు. ఈ క్రమంలో గ్రేటర్ వ్యాప్తంగా కేవలం నెల రోజుల్లోనే 217 డెంగీ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.
గ్రేటర్‌లోని పలు దవాఖానల్లో డెంగీ పరీక్షలు జరిపే కిట్స్ కొరత కారణంగా డెంగీ అనుమానిత రోగులు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరంలో జ్వరపీడితులకు సంబంధించి ప్రత్యేక దవాఖానగా పేరున్న ఫీవర్ హాస్పిటల్లో కిట్స్ కొరత వల్ల ఓపీ రోగులకు డెంగీ పరీక్షలు చేయడంలేదని రోగులు చెబుతున్నారు. వైద్యులు ప్రిస్క్రిప్షన్‌లో డెంగీ పరీక్షలు రాస్తే ఎందుకు చేయరని అక్కడి ల్యాబ్ సిబ్బందిని ప్రశ్నిస్తే.. డెంగీ పరీక్షల కిట్స్ లేవని, పరీక్షలు జరిపే యంత్రం పనిచేయడం లేదనే కారణాలు చెబుతున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. దీంతో పరీక్షలు బయట ప్రైవేటు ల్యాబ్స్‌లో చేయించుకోవాల్సి వస్తున్నదని వాపోతున్నారు. ఐపీ రోగులకు మాత్రం రక్త నమూనాలు సేకరించి డెంగీ పరీక్షల కోసం ఉస్మానియాకు పంపుతున్నట్లు దవాఖాన వర్గాలు తెలిపాయి.
సర్కార్ దవాఖానల్లో సరైన వైద్య సదుపాయాలు, చికిత్స అందించకపోవడంతో డెంగీ రోగులు ప్రైవేటు దవాఖానలను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిని ఆసరాగా చేసుకుని కొన్ని ప్రైవేటు దవాఖానలు రోగులను నిలువు దోపిడీ చేస్తున్నట్లు రోగి సహాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు ఆరోగ్య కేంద్రాలలో డెంగీ పరీక్షల కోసం రక్త నమూనాలను తీసుకున్న తరువాత రిపోర్ట్లు జారీ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, సకాలంలో సరైన చికిత్స అందక రోగి ఆరోగ్య పరిస్థితి విషమిస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. ప్రాణం కాపాడుకోవడానికి ప్రైవేటుకు వెళితే అనవసరమైన పరీక్షలు చేయించి.. బారెడు బిల్లులను చేతిలో పెడుతున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు.
డెంగీ పరీక్షల కోసం ఒక్కో దవాఖానలో ఒక్కో రేటు ఉందని, రూ. 3వేల నుంచి రూ. 12వేల వరకు వసూలు చేస్తున్నారని, అవసరం ఉన్నా, లేకున్నా కొన్ని దవాఖానల్లో ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ప్రైవేటు దవాఖానలకు వచ్చిన ప్రతి డెంగీ కేసు వివరాలను సంబంధిత దవాఖాన నిర్వాహకులు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు అందించాల్సి ఉంటుందని, కానీ అలా జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్కార్ దవాఖానల్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు కల్పించి, సకాలంలో సరైన చికిత్స అందిస్తే ప్రైవేటు దవాఖానలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని అభిప్రాయపడుతున్నారు.