సిటీబ్యూరో, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ): ‘హైకోర్టు ఆర్డర్లను హైడ్రా అధికారులు ధిక్కరించారు. చెత్తను తొలగిస్తామని చెప్పి గోతులు తీశారు. పట్టా భూముల్లో ప్లాట్లను చిందరవందర చేశారు. అసలు ఎలాంటి హద్దుల నిర్ధారణ లేకుండా మాపై జులుం చూపిస్తున్నారు’.. ఇది సున్నం చెరువు పక్కనే ఉన్న సియేట్ కాలనీ వాసుల ఆవేదన. గుట్టల బేగంపేటలో హైడ్రా వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. ఒకవైపు హైకోర్టులో కేసు నడుస్తుండగానే మరోవైపు సియేట్కాలనీలో పెద్ద ఎత్తున డిగ్గింగ్ చేయడంతో సోమవారం కాలనీవాసులంతా ఆందోళనకు దిగారు.
తమ ప్లాట్లలో ఎలా గోతులు తీస్తారంటూ హైకోర్టు ఉత్తర్వులను పట్టుకొని చూపిస్తూ హైడ్రా అరాచకానికి పాల్పడుతుందంటూ ఆరోపించారు. తమ ప్లాట్లకు సంబంధించిన అన్ని వివరాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఇచ్చినా.. ఆయన మాత్రం భూమికి భూమి మాట్లాడుకోమని చెబుతున్నారని, అసలు తాము కష్టపడి కొనుక్కున్న భూములు ఎలా వదిలేయాలంటూ ప్రశ్నిస్తున్నారు. సున్నం చెరువు ఉన్న సర్వే నంబర్, తమ కాలనీ సర్వే నంబర్లపై వివాదం నడుస్తున్నప్పుడు ఈ విషయంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నా.. స్టేటస్కోలు, ఇంటరియమ్ ఆర్డర్లు ఇస్తున్నా హైడ్రా వాటిని పట్టించుకోవడం లేదని, ఆ ఉత్తర్వులను ఖాతరు చేయకుండా పోలీసు .. బలగంతో తమను బెదిరిస్తూ భూముల్లో బలవంతంగా డిగ్గింగ్ చేస్తున్నారని కాలనీవాసులు ఆరోపించారు.
సున్నంచెరువు వద్ద తమ ప్లాట్ల సమీపంలో నోటికి నల్ల రిబ్బన్ కట్టుకుని చేతిలో ప్లకార్డులతో హైడ్రాతీరును నిరసిస్తూ ప్రదర్శన చేశారు. తామంతా రిటైర్డ్ ఉద్యోగులమని, తాము కష్టపడి కొనుక్కున్న ప్లాట్లను ఎలా లాగేసుకుంటున్నారో చూడండంటూ అక్కడకు వచ్చిన వారికి తమ ఆవేదనను చెప్పుకొన్నారు. హైకోర్టు ఈనెల 1న ఇచ్చిన ఆర్డర్ ప్రకారం జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, హెచ్ఎండీఏ, హైడ్రాలను సియే ట్ ప్లాట్లలో పనులు చేయవద్దని, సియేట్ కాలనీ భూమిని మార్చవద్దని, ప్లాట్లలో ఎలాంటి గుంతలు తీయవద్దని, ఫెన్సింగ్ చేయవద్దని చెప్పిందంటూ ప్లకార్డులు రాసి ప్రదర్శించారు.
సీనియర్ సిటిజైన్లెన తమను హైడ్రా చాలా ఇబ్బంది పెడుతున్నదని, ఒక వైపు కోర్టులో కేసు నడుస్తుండగానే కమిషనర్ రంగనాథ్ సున్నం చెరువుకు వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వారిని పనులపై ఆరా తీసి పనులు వేగంగా చేయాలని చెప్పడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. సున్నం చెరువు వద్ద వారు నిరసన వ్యక్తం చేశారు. తమను పోలీసులు ఎలాంటి కేసులు పెట్టకుండా ముందస్తు అరెస్టుల పేరుతో అదుపులోకి తీసుకుంటున్నారని, హైడ్రా ఎలా చెబితే అలా వింటూ పోలీసులు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కోర్టు ఆర్డర్లు చూపించినా హైడ్రాతో మాట్లాడుకోవాలని చెబుతున్నారని సియేట్ కాలనీ వాసులు అన్నారు. ఒకవైపు చెరువు నోటిఫై చేయకుండా, శాఖల పరంగా చెరువు విస్తీర్ణమెంతో పూర్తిగా నిర్ధారించకుండా, హద్దులెక్కడున్నాయో తెలుసుకోకుండా తమ భూముల్లో దౌర్జన్యానికి పాల్పడడం ఎంతవరకు కరెక్టని సియేట్ ప్రతినిధులు ప్రశ్నించారు.
తాను మహిళను అని కూడా చూడకుండా పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని, సాయంత్రం వరకు పోలీస్‌స్టేషన్‌లో కూర్చోబెట్టి ఆ తర్వాత వదిలేశారని రాధ మహిళ వాపోయారు. తమకు అన్ని పర్మిషన్లు ఉన్నా తమ బిల్డింగ్ కూల్చేశారని, అంతేకాకుండా కోర్టులో కేసు నడుస్తుండగానే కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తూ తమ భూమిలో పనులు చేస్తున్నారని ఆమె చెప్పారు. ఎవరైనా ప్రశ్నిస్తే తమపై దాడులు చేస్తున్నారని, తమను బెదిరిస్తున్నారని రాధ అన్నారు. చెరువు హద్దులే నిర్ధారించకుండా కట్టుకున్న ఇల్లు ఎలా కూల్చేస్తారని, ఇప్పుడు కూడా అదే రీతిలో మాభూముల జోలికి ఎలా వస్తారని ఆమె ప్రశ్నించారు.
మేమంతా రిటైర్డ్ ఉద్యోగులం. సీనియర్ సిటిజన్లం. ఎల్ఆర్ఎస్ ఆధారం చేసుకొని మాకు పర్మిషన్ ఇచ్చారు. మేము ఎప్పుడో కొనుక్కున్న భూమిలోకి వచ్చి ఇది చెరువు హద్దుల్లో ఉందని చెప్పి మా భూమిని లాక్కోవడం ఎంత వరకు కరెక్ట్. అసలు ఇంతవరకు సున్నంచెరువు ఏ సర్వే నంబర్లో ఉందో హైడ్రాకు తెలియనే తెలవదు. కేవలం ఒక ఇరిగేషన్ ఇంజినీర్ చేసిన తప్పుతో ఇప్పుడు హైడ్రా మా భూమిలోకి వచ్చి ఆ తర్వాత తప్పు తెలిసినా వెనక్కుపోతే తమ పరువు పోతుందని అన్యాయంగా మా భూములు లాక్కుంటున్నారు.