Gandhi Nagar | చిక్కడపల్లి, జనవరి 29 : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లోని స్వామి వివేకానంద్‌నగర్ బస్తీలో రెవెన్యూ, జీహెచ్ఎంసీ అధికారులు పేదల ఇండ్లు కూల్చివేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. సోమవారం ఉదయం ముషీరాబాద్ తహసీల్దార్ వెంకటలక్ష్మి, జీహెచ్ఎంసీ డీఎంసీ తిపర్తి యాదయ్య, రెవెన్యూ ఇన్స్పెక్టర్ హేమంత్‌కుమార్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ రమేశ్ పర్యవేక్షణలో జీహెచ్ఎంసీ సిబ్బంది జేసీబీలతో చేరుకున్నారు. కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేసిన బస్తీవాసులను అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్థానిక కార్పొరేటర్లు పావని, రవిచారి, బీజేవైఎం నాయకుడు వినయ్‌కుమార్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను సైతం అడ్డుకున్నారు. అనంతరం సిబ్బంది బస్తీలోని 20 ఇండ్లను నేలమట్టం చేశారు. అధికారులు హైకోర్టు ఆదేశాల మేరకు తాము ఇండ్లను కూల్చివేసినట్లు చెప్పారు. కాగా, బస్తీవాసులకు అండగా నిలవడానికి వచ్చిన ఎమ్మెల్యే ముఠాగోపాల్‌తో పాటు వివిధ పార్టీల వారికి, మీడియా ప్రతినిధులకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కోర్టు ఆదేశాలు ఉన్నాయంటూ పేదలకు అన్యాయం చేయడం సరికాదని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌తో మాట్లాడినట్లు చెప్పారు. అధికారులు పేదలకు అన్యాయం చేశారని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రం శంకర్, జీఎన్ కేశవ్ అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కొద్ది రోజులు వెసుల బాటు కల్పించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించినా.. పట్టించుకోలేదన్నారు.