GHMC | అమీర్పేట్, ఫిబ్రవరి 11 : కోర్టు ఉత్తర్వుల మేరకు ఎస్సార్ నగర్ ఈడబ్ల్యూఎస్ క్వార్టర్లలో జీహెచ్ఎంసీ అధికారులు ఉద్రిక్తతల నడుమ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈడబ్ల్యూఎస్ క్వార్టర్ నెంబర్ 41లో యజమాని రామకృష్ణ జీహెచ్ఎసంఈ ద్వారా గ్రౌండ్ ప్లస్ టూ ఫ్లోర్లకు అనుమతులు పొంది, అదనంగా మూడవ అంతస్తుతో పాటు పెంట్ హౌస్ నిర్మాణాలను కూడా చేపడుతుండడంతో కాలనీ అసోసియేషన్ ప్రతినిధులుగా చెబుతున్న కొందరు వ్యక్తులు ఈ అక్రమ నిర్మాణాల అంశాన్ని కోర్టులో సవాల్ చేశారు.
ఈ మేరకు కోర్టు అక్రమంగా జరుగుతున్న నిర్మాణాలను కూల్చివేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం తమకు అందిన ఉత్తర్వుల మేరకు జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి మన్సూర్ తారిక్, తన సిబ్బందితో కలిసి అక్రమ అంతస్తుల కూల్చివేతలు చేపట్టారు. ఇదిలా ఉంటే కూల్చివేతలు చేపట్టేందుకు వచ్చిన టౌన్ ప్లానింగ్ సిబ్బందిని నిర్మాణదారు రామకృష్ణ, కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమపై ఫిర్యాదులు చేశారని చెబుతున్న వారి నిర్మాణాలు కూడా తాను చేపడుతున్న నిర్మాణాలకు సమాంతరంగానే ఉన్నాయని, అధికారులు వాటిని వదిలేసి తన నిర్మాణాలను కూల్చివేయడం అన్యాయమంటూ నిరసనకు దిగారు. నిరసనకు దిగిన రామకృష్ణ కుటుంబ సభ్యులను నియంత్రించేందుకు జిహెచ్ఎంసి సిబ్బంది పోలీసుల సహకారం తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఇలా ఉంటే తమకు అందిన ఉత్తర్వుల మేరకు కూల్చివేతలు చేపడుతున్నామని టౌన్ ప్లానింగ్ అధికారులు స్పష్టం చేశారు.
చిన్న స్థలం… పెద్ద కూల్చివేతలు…
ఇదిలా ఉంటే జిహెచ్ఎంసి అధికారులు ఎక్కడైనా కూల్చివేతలు చేపట్టాల్సి వస్తే.. వారు మానవీయ కోణంలో వ్యవహరిస్తారని పేరు ఉంది. భవన నిర్మాణాలకు నష్టం కలగకుండా నామమాత్రంగా కూల్చివేతలు చేపట్టి తంతును పూర్తి చేస్తారు. కానీ కేవలం 85 గజాల్లో మాత్రమే నిర్మాణాలు చేపట్టే వీలున్న ఈడబ్ల్యూఎస్ క్వార్టర్స్ 41 విషయంలో మాత్రం జిహెచ్ఎంసి సిబ్బంది కాస్త కఠినంగానే వ్యవహరించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూడవ అంతస్తులో అక్రమ నిర్మాణాన్ని జిహెచ్ఎంసి సిబ్బంది తొలగించిన విస్తీర్ణాన్ని పరిశీలిస్తే కూల్చివేతల విషయంలో స్థానికంగా ఉన్న కొందరు వ్యక్తుల ఒత్తిడి పనిచేసి ఉంటుందని పలువురు ఆరోపిస్తున్నారు.