బేగంపేట్ జూన్ 14: బేగంపేట్ డివిజన్ మాతాజీనగర్లోని సర్వేనం. 194/8/1లో సుమారు 10 ఎకరాల ఎఫ్టీఎల్ స్థలంలో చేపట్టిన వివాదాస్పద నిర్మాణాలతో పాటు అక్రమంగా నిర్మించిన పలు నిర్మాణాలను బేగంపేట్ జీహెచ్ఎంసీ అధికారులు కూలగొట్టారు. గతంలో ఓ బడా ప్రైవేట్ సంస్థ ఇక్కడ ప్రైడ్ ఇండియా పేరుతో అక్రమంగా తప్పుడు పత్రాలు సృష్టించి ఈ ఎఫ్టీఎల్ స్థలంలో వెంచర్‌ను ఏర్పాటు చేసి అమాయక ప్రజలకు ప్లాట్స్‌ను విక్రయించారు. దీంతో ప్లాట్స్ కొనుగోలు చేసిన వారు నిర్మాణాలు చేపడుతుండగా అది అక్రమ వెంచర్, ఎఫ్టీఎల్ ల్యాండ్ అని జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు తేల్చారు. ప్రైడ్ ఇండియా సంస్థ ప్లాట్లు అమ్మేసి అక్కడ నుంచి దుకాణం ఎత్తేసింది.
అప్పటి నుంచి అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన లబ్ధిదారులు ఎలాగైనా ఇండ్లను నిర్మించుకోవాలని 2016 నుంచి అప్పుడప్పుడు నిర్మాణాలు చేపట్టడం ప్రారంభించారు. అనంతరం జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి కూల్చివేయడం జరుగుతుంది. ఇలా 2016, 2019, 2021, 2024 ఏప్రిల్‌లో ఇలా పలుమార్లు నిర్మాణాలను కూల్చి వేశారు. తాజాగా అక్కడ ప్లాట్లు కొనుగోలు చేసిన వారిలో కొందరు ఇలాగైతే లాభం లేదనుకొని ఆ వెంచర్లో ఓ మసీదు నిర్మాణం చేపట్టారు. ఇది గుర్తించిన స్థానికులు అక్కడ ధర్నా చేసి ఇటీవల ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు రెండు రోజుల పాటు అక్కడ వెలసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఈ కూల్చివేతల్లో జీహెచ్ఎంసీ జోనల్ స్థాయి అధికారులతో పాటు టౌన్‌ప్లానింగ్ అధికారులు, సిబ్బంది పోలీసులు పాల్గొన్నారు.
ఎఫ్టీఎల్ స్థలంలో ఎన్నిసార్లు అక్రమ నిర్మాణాలను కూల్చివేసినా.. కొనుగోలు దారులు తిరిగి అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు అక్కడ నర్సరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే అక్రమ నిర్మాణాలను తొలగించిన అనంతరం అక్కడ నర్సరీని ఏర్పాటు చేస్తున్నట్టు ఓ బోర్డును ఏర్పాటు చేశారు. భవిష్యత్‌లో ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేపడితే తిరిగి కూల్చివేయడం తప్పదని అధికారులు హెచ్చరించారు.