దుండిగల్, ఆగస్టు 6 : గాజులరామారంలో హైడ్రా అధికారులు పంజా విసిరారు. ప్రభుత్వ భూములతో పాటు చెరువుల్లోని ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఆక్రమించి నిర్మించిన పలు ఇండ్లను అధికారులు నేలమట్టం చేశారు. మంగళవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కూల్చివేతలు కొనసాగాయి. హైడ్రా అధికారులు 52 నిర్మాణాలను మాత్రమే కూల్చివేసినట్లు చెప్పినప్పటికీ సుమా రు 70కి పైగా ఇండ్లను నేలమట్టం చేసినట్లు తెలుస్తున్నది. చెరువులు, కుంటల్లోని బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ స్థలాల పరిరక్షణకు ప్రభు త్వం ఏర్పాటు చేసిన హై డ్రా.. మొదటిసారి గాజులరామారం నుంచే చర్యలు ప్రారంభించింది.
కుత్బుల్లాపూర్ (మండలం) నియోజకవర్గం పరిధి, గాజులరామారంలోని సర్వే నం.329/1 లోని చింతల్‌కుంట చెరువు ఎఫ్టీఎల్, బఫర్జోన్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లు గుర్తించిన అధికారులు మంగళవారం వాటిని కూల్చివేశారు. చెరువుల పునరుద్ధరణతో పాటు, నీటి వనరుల పరిరక్షణ, పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గాజులరామారంలోని చింతల చెరువు బఫర్ జోన్‌తో సహా 44.3 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన చెరువు పుల్ట్యాంక్ లెవెల్ (ఎఫ్టీఎల్) పరిధిలో అక్రమంగా 52 నిర్మాణాలు చేపట్టినట్లు స్థానికుల నుంచి అధికారులకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్ ఆదేశాలతో కూల్చివేతలు చేపట్టారు. కూల్చివేతల్లో ఆర్ఎఫ్ఓ పాపయ్య, డీఎస్పీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ బాల్‌రెడ్డి సహకారంతో హైడ్రా విభాగం మార్షల్స్ డీ.ఆర్.ఎఫ్ బృందాలతో అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించారు.
చింతల్‌కుంట చెరువులోని ఎఫ్టీఎల్, బఫర్జోన్లను ఆక్రమించి ఇండ్లు నిర్మించారనే కారణంతో మంగళవారం పలు ఇండ్లను హైడ్రా అధికారులు కూల్చివేశారు సరే. మరి బాధితుల గోడును ఎవరు పట్టించుకుంటారనేది మిలియన్‌డాలర్ల ప్రశ్నగా మారింది. ఇక్కడ ఇండ్లు కొనుగోలు చేసిన వారందరూ పేదలే.ఒక్కొక్క ఇంటికి 15లక్షలు చెల్లించి కొనుగోలు చేశారు. ఇప్పుడు వారిని ఆదుకునేది ఎవరు. ప్రభుత్వ భూములను పేదలకు అంటగట్టి కోట్లాది రూపాయలు సంపాదించుకున్న భూ కబ్జాదారులపై చర్యలు తీసుకుంటారా? పేదలు కోల్పోయిన డబ్బులను కబ్జాదారుల నుంచి రికవరీ చేసి బాధితులకు ఎవరు ఇస్తారు? వారి జీవితకాలం కష్టం అక్రమార్కులు మెక్కాల్సిందేనా.? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు స్థానికులు. పేదలను మోసగించిన అక్రమార్కులపై కఠినచర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.