శేరిలింగంపల్లి, నవంబర్ 17: గచ్చిబౌలిలో సంధ్య కన్వెన్షన్ సమీపంలో చేపడుతున్న పలు అక్రమ నిర్మాణాలను సోమవారం హైడ్రా కూల్చివేసింది. సంధ్య శ్రీధర్‌రావు చేపట్టిన భారీ నిర్మాణాలు, రేకులు షెడ్లు, కంటైయినర్లు, ఫుడ్కోర్డులను నేలమట్టం చేశారు. భారీ బందోబస్తు మధ్య హైకోర్డు ఉత్తర్వుల ప్రకారం ఈ చర్యలు చేపట్టినట్లు హైడ్రా అధికారులు పేర్కొన్నారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని గచ్చిబౌలిలో ప్రదాన రహదారికి అనుకొని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయిస్ కో-ఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ(ఎఫ్‌సీఐ) లేఅవుట్లో కొంతకాలంగా రహదారులు, పార్కు స్థలాలను పట్టించుకోకుండా చేపట్టిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు.
ఉదయమే రంగంలోకి దిగిన హైడ్రా 3 భారీ హిటాచీ క్రేన్లు, 7 జేసీబీలు పలు కట్టడాలు నేలమట్టం చేసింది. ఎఫ్‌సీఐ లేఅవుట్లో 40 అడుగుల రహదారుల్లో అడ్డంగా నిర్మించిన నాలుగు అంతస్థుల భవనం, మరో 2 భవన సముదాయాలు, మ్యాంగో ఫుడ్‌కోర్టు, యునో ఫుడ్‌కోర్డు ప్రాంగణం, అందులోని కంటైనర్లను పూర్తిగా తొలగించారు. మొత్తం 7 చోట్ల రహదారులను ఆక్రమించి నిర్మించిన 40 వరకు అక్రమ కట్టడాలు, ఫుడ్కోర్డులు, ఓ పెట్రోల్‌బంకు గోడను, రెండు సెల్లార్ భవంతుల కూల్చివేతలు చేపట్టారు. కట్టడాలతో ఆక్రమణకు గురైన రహదారులకు విముక్తి కల్పించి, వాటి హద్దులు నిర్ధారించి ప్లాట్ల యజమానులకు ప్రయోజనం కలిగేలా ఇచ్చిన హైకోర్టు అదేశాలను అధారంగా ఈ కూల్చివేతలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 40 మంది హైడ్రా సిబ్బంది, 35 మంది పోలీసులు, హైడ్రా సర్వే బృందం, పలువురు సిబ్బంది ఈ కూల్చివేతల్లో
పాల్గొన్నారు.