సిటీబ్యూరో, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): మూసీ పేరిట బస్తీల జోలికొస్తే.. తరిమికొడుతామని, రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో ఒక్క ఇంటిని కూడా నిర్మించకుండా పేదల ఇండ్లను కూల్చి రియల్ ఎస్టేట్ వ్యాపారంతో లక్షన్నర కోట్లను దండుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చేపట్టిన మూసీ పోరుబాటలో భాగంగా శుక్రవారం గోషామహల్ నియోజకవర్గం అంబేద్కర్ నగర్లో పరీవాహక ప్రాంత ప్రజలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ పేదల ఇండ్లు పరీవాహకంలో ఉంటే మూసీ కలుషితం అవుతుంది కానీ.. పెద్ద పెద్ద మాళ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు కడితే కలుషితం కాదా? అని ప్రశ్నించారు.
‘మా ఇండ్లు కూల్చడానికి మీరెవరు’ అని కాంగ్రెస్ నేతలను గల్లా పట్టుకొని నిలదీయాలని దాసోజు శ్రవణ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కుంభకోణాన్ని ఆపేందుకు బీఆర్ఎస్ పరీవాహక బాధితులకు అండా ఉంటుందని హామీ ఇచ్చారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్‌రెడ్డి మూసీ సుందరీకరణ పేరిట లక్షన్నర కోట్ల కుంభకోణానికి తెర తీశారు. రాజేంద్రనగర్‌లో మొదలైతే గోషామహాల్లో కూడా కూల్చేస్తారని అందరూ గుర్తుంచుకోవాలి. అన్ని ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలి. అన్ని బస్తీల ప్రజలు ఐక్యంగా పోరాటం చేయాలి. రాజకీయాలకు అతీతంగా పోరాటం చేస్తేనే మీ ఇండ్లు కూల్చకుండా ఆపగలుతాం. రెండున్నరేండ్లు ఇండ్లను కాపాడుకుంటే తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. అప్పుడు ప్రతి ఒక్కరికీ నివాస భద్రత కల్పిస్తారని హామీ ఇస్తున్నా’. అని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు.