సిటీ బ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ గుడిని కూల్చి ఆ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు యత్నించిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ శివాజీ సేన ప్రతినిధులు డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాలను కూల్చితే సహించమని స్పష్టం చేశారు. అత్యంత ఖరీదైన ప్రాంతంలో గుడి ఉండటంతో కొందరు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గుడి స్థలాన్ని కబ్జా చేయాలని ప్రయత్నిస్తే పెద్ద ఎత్తను నిరసన కార్యక్రమాలు చేపట్టి అడ్డుకుంటామని హెచ్చరించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో గుడిని కూల్చిన అధికారులపై ఐదు రోజుల్లోగా చర్యలు తీసుకుని కబ్జాకు గురికాకుండా అడ్డుకోవాలని వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ శివాజీ సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసాచారి, శివాజీ సేన ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆలయానికి స్థలం ఇప్పిస్తా..
బంజారాహిల్స్: సున్నితమైన అంశాల్లో అధికారుల అత్యుత్సాహంతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీలో శ్రీ పెద్దమ్మతల్లి ఆలయాన్ని వారంరోజుల క్రితం రెవెన్యూశాఖ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఆలయ నిర్వాహకులతో పాటు బస్తీకి చెందిన నాయకులు ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను కలిశారు. షేక్‌పేట మండల రెవెన్యూ సిబ్బంది తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. లేనిపోని వివాదాలు సృష్టించడం ద్వారా ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగించడం కొంతమంది అధికారులకు అలవాటుగా మారిందన్నారు. గుడికి స్థలాన్ని కేటాయించేందుకు అధికారులతో కలిసి త్వరలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
బీజపీ నేతల ఆందోళన..
ఎమ్మెల్యే కాలనీలోని పెద్దమ్మతల్లి గుడిని రెవెన్యూ అధికారులు కూల్చివేయడం అ త్యంత దుర్మార్గమని బీజేపీ ఉపాధ్యక్షుడు చింతల రాంచంద్రారెడ్డి అన్నారు. సోమవారం పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు,నేతలతో కలిసి ఆలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఆలయానికి అవసరమైన 500 గజాల ప్రభుత్వ స్థలాన్ని తాము డబ్బులు ఇచ్చి కొంటామని, నేమి ఫౌండేషన్ తరపున ఆలయాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కలిసి రావాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో అనేక చెరువులు, ప్రభుత్వస్థలాలు ఆక్రమణలకు గురయినా పట్టించుకోని ప్ర భుత్వం ఆలయాలను కూల్చేయడం సిగ్గుచేటని ఆరోపించారు.