చిక్కడపల్లి, మే 14: మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే మిస్‌వరల్డ్ అందాల పోటీలను రద్దుచేయాలని మిస్ వరల్డ్ అందాల పోటీల వ్యతిరేక వేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇటీవల పోటీల నిర్వహణకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన ఐక్యవేదిక నాయకులు, కార్యకర్తల అక్రమ అరెస్టులను వారు ఖండించారు. మిస్ వరల్డ్ అందాల పోటీల వ్యతిరేక వేదిక నిరసన కార్యక్రమంపై రాష్ట్ర ప్రభుత్వ అప్రజాస్వామిక దాడిని ఖండిస్తూ బుధవారం బాగ్ లింగంపల్లిలోని ఐలమ్మ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్వహించారు.
ఐక్యవేదిక నాయకులు.. మల్లు లక్ష్మి,ఆశాలత,అరుణ జ్యోతి, సంధ్య, స్వరూప, జయ సావిత్రి, శ్రీదేవి, ఝాన్సీ, అనసూయ తదితరులు హాజరై మాట్లాడారు. 72వ మిస్ వరల్డ్ అందాల పోటీలు ఈనెల 10వ తేదీన హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభం అయ్యాయి. 109 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్న ఈ పోటీలను ఈనెల 31వ తేదీ వరకు జరిపేందుకు 200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుందని అన్నారు.
స్త్రీల అందాన్ని శారీరక కొలతలు, అంగాంగ ప్రదర్శనల స్థాయికి దిగజారుస్తున్న ఈ మిస్ వరల్డ్ పోటీలను రాష్ట్రవ్యాప్తంగా మహిళా, యువజన, విద్యార్థి సంఘాలంతా కలిసి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అని అన్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ నిర్వహిస్తున్న ఈ పోటీలు మహిళల ఆత్మగౌరవాన్ని మార్కెట్ సరుకుగా మారుస్తున్నాయని మండిపడ్డారు. దిగజారిన ఈ మార్కెట్ సంస్కృతి మన స్త్రీల మానమర్యాదలను ఏ మాత్రం పెంచబోవని పేర్కొన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు.. చేనేత పరిశ్రమకు చేయూత ఇచ్చేందుకు, పర్యాటక రంగం అభివృద్ధికి ఈ మిస్ వరల్డ్ అందాల పోటీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతుందని.. కానీ ఈ పోటీల నిర్వహణ వెనుకున్న అసలు ఉద్దేశం… కాస్మొటిక్ కంపెనీల వ్యాపార ప్రయోజనమే అని వారు ఆరోపించారు.
ఈ వేదిక ద్వారా కొంతకాలంగా మిస్ వరల్డ్ అందాల పోటీల వ్యతిరేక వేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇందులో భాగంగా ఈనెల 10వ తేదీన మిస్ వరల్డ్ అందాలు పోటీలు జరుపుతున్న గచ్చిబౌలి స్టేడియం దగ్గర ప్రజాసంఘాలు నిర్వహించిన నిరసన ప్రదర్శనపై పోలీసులు అప్రజాస్వామికంగా దాడి చేశారని విమర్శించారు. కొందరిని అరెస్టు చేసి పరిసర పోలీస్ స్టేషన్లకు తరలించారని అన్నారు. అరస్టైన వారికి పోలీస్ స్టేషన్లలో తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వని పరిస్థితి. అరస్టైన వారిలో షుగర్ పేషెంట్స్ ఉన్నారని పదేపదే చెప్పినా రాత్రి 9:30 గంటల వరకు టిఫిన్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారన్నారు. అందరినీ ఫోటోలు తీసుకుని, రాతపూర్వకంగా బాండ్ పేపర్‌పై సంతకాలు పెట్టించుకోని వదిలేశారని తెలిపారు. పౌరులు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేసే కనీసహక్కును కూడా ఈ ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు.